అన్నివర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్ ఎజెండా


Mon,September 10, 2018 11:52 PM

-కొడంగల్‌లో జోరందుకున్న నరేందర్‌రెడ్డి ప్రచారం
-గ్రామ గ్రామాన గులాబీ శ్రేణుల ఘన స్వాగతం
-ఆశీర్వదించండి.. అండగా ఉంటానని హామీ
-రేవంత్‌రెడ్డి కారణంగానే నియోజకవర్గ వెనుకబాటు: మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి
కొడంగల్, నమస్తే తెలంగాణ: కొడంగల్ నియోజకవర్గంలో కారు జోరు ఊపందుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోమవారం కొడంగల్ మండలంలోని పాతకొడంగల్, పర్సాపూర్, అప్పాయిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ముందుగా పాత కొడంగల్ గ్రామంలోని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం గ్రామంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఆశీర్వదించండి. అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా పేరొందిందన్నారు. రైతులకు అండగా ఉంటూ గతంలో ఏ నాయకులు అమలు చేయని పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల మరమ్మతులు, పూడికతీత తీసి చెరువుల్లో నీటి సామర్థ్యాన్ని పెంచారన్నారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా కోతలు లేని 24 గంటల ఉచిత కరెంటును అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా పెట్టుబడి కోసం రైతు ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దనే అంశాన్ని గుర్తించి పంట సాగుకు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4 వేలు అందించారన్నారు. రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 మంది వరకు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందాయన్నారు. ఎంత పొలం ఉంది అని చూడకుండా గుంట భూమి ఉన్నా బీమాకు అర్హులుగా నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.300 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. దీంతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి వర్గానికి లక్షలాది వ్యయంతో కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధే ఎజెండాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

ఆశీర్వదించండి.. అండగా ఉంటా..
ప్రజలు ఆశీర్వదిస్తే అండగా ఉండి వారికి సేవ చేసుకుంటానని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. నరేందర్‌రెడ్డి గ్రామగ్రామాన నిర్వహిస్తున్న ప్రచారంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కొడంగల్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ద్వారా కొడంగల్ ప్రజలు అన్నింటా వెనుకబడ్డారన్నారు. ఎమ్మెల్యే స్థానికంగా లేని కారణంగా అవస్థలకు గురికావాల్సి వస్తుందన్నారు. ఆయనను టీవీలు, పేపర్లలో చూసే భాగ్యం కొడంగల్ ప్రజలకు పట్టిందన్నారు. నోరు పారేసుకుంటేనే నాయకులు, పదవులు దక్కుతాయనే ధోరణి రేవంత్‌రెడ్డిది అన్నారు. అభివృద్ధికి పట్టం కట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని, టీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల కష్టాలు, సమస్యలను తీర్చేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కొత్త వ్యక్తిగా భావించకుండా అభివృద్ధిని కోరుకోవాలన్నారు. గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రేవంత్‌రెడ్డి మాటల మరాఠీ
రేవంత్‌రెడ్డి మాటతోనే ప్రజలను మోసం చేస్తున్నారని, గత ఎన్నికల్లో కొడంగల్‌కు ప్రాజెక్టు, సిమెంటు ఫ్యాక్టరీ, రైలు మార్గాన్ని తీసుకొస్తానని హామీతో కూడిన పెద్దపెద్ద కటౌట్లను పెట్టుకొని ప్రచారం చేసుకున్నా ఏ ఒక్కటీ సాధించలేదని పేర్కొన్నారు. నేటి ఆధునిక యుగంలో నియోజకవర్గంలో రోడ్డు లేని గ్రామాలు ఇప్పటికీ ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. రెండు పర్యాయాలు రేవంత్‌రెడ్డి గెలిచి ఏం సాధించాడో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాను చేపట్టానని గొప్పలు చెప్పుకొని కాలం వెళ్లదీస్తున్నాడన్నారు. నిజానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏ ఒక్క లేఖను రాయలేదన్నారు. ఎంతకూ తాను సీఎం కావాలనే కోరిక మాత్రమే ఆయనలో ఉండిపోయిందని, ప్రజా సమస్యలు విస్మరించారన్నారు. పదవుల కోసం పార్టీలు మారుతూ హద్దులు మీరి ప్రవర్తించడం ఆయన నైజంగా మారిందన్నారు. ఆయన వెంట ఉన్న కార్యకర్తలు నేడు కోర్టు కేసుల్లో సతమతమవుతున్నట్లు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి దండును దించి కొడంగల్‌లో మెరిసిపోతున్నారని, ప్రజలు నిజానిజాలను గ్రహించి అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశముఖ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ, టీఆర్‌ఎస్ నాయకులు ఉస్మాన్, మధుసూదన్‌యాదవ్, ప్రతాప్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, అంజద్, దత్తురెడ్డి, ముక్తార్, బస్వరాజ్, కిషన్‌సింగ్, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...