కొడంగల్ కోత్తజోష్


Sun,September 9, 2018 11:29 PM

-పట్నం నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌తో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం
-అట్టహాసంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం ప్రారంభం
-ఇప్పటికే మంత్రులు, మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి
-కొడంగల్ వెనుకబాటుపై సీఎం దృష్టికి తీసుకెళ్లగా సత్వరమే రూ.300కోట్లు మంజూరు
-వివిధ దశల్లో కొనసాగుతున్న పనులు
-56 కొత్త పంచాయతీల్లో.. 29 గిరిజన తండాలు
-రేవంత్‌రెడ్డి అలసత్వ వైఖరితో విసిగిపోయిన ప్రజలు
-గులాబీజెండా ఎగురడం ఖాయమంటున్న విశ్లేషకులు
కొడంగల్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఒకేసారి 105 మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ ఏర్పడింది. ఇందులో భాగంగా కొడంగల్ నియోజకవర్గానికి పట్నం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో విసిగివేసారిన నియోజకవర్గ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్న సమయంలో పట్నం నరేందర్‌రెడ్డికి టికెట్ లభించడంతో నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలను చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డికి దీటైన వ్యక్తిని కేసీఆర్ బరిలోకి దించారని, ఇక రేవంత్‌రెడ్డి బిచానా సర్దాల్సిన రోజులు దగ్గర పడ్డాయని ప్రజలు పేర్కొంటున్నారు.

1952కు ముందు కొడంగల్ ముఖచిత్రం
1952కు ముందు కొడంగల్ నియోజకవర్గం నిజాం పాలనలో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో మున్సిపాలిటీగా చలామాణిలో ఉండేది. కాబట్టే నేటికీ కొడంగల్ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు గ్రామస్తులు కర్ణాటక సంప్రదాయాలను అనుసరిస్తుంటారు. అప్పట్లో భాషా ప్రాతిపదికన ప్రాంతాల విభజన జరిగింది. దాంతో గుల్బర్గా జిల్లాలోని కొడంగల్, రైచూర్ జిల్లాలోని మద్దూర్ ప్రాంతాలు రెండు పంచాయతీ సమితిలుగా ఏర్పడ్డాయి. కొడంగల్ పంచాయతీ సమితి పరిధిలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌లు ఉండగా, మద్దూర్ పంచాయతీ సమితి (బ్లాక్ సమితి)లో కోస్గి, మద్దూర్, దామరగిద్దలు కలిసి ఉండేవి. అప్పట్లో జరిపిన నియోజకవర్గ పునర్విభజనలో కొడంగల్, మద్దూర్ రెండు ప్రాంతాలు వేర్వేరుగా నియోజకవర్గ కేంద్రాలుగా చలామణిలో ఉండేవి. ఆ తరువాత మళ్లీ భాషా ప్రాతిపదికన రాష్ర్టాల పునర్విభజన జరిగిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి కొడంగల్, మద్దూర్ రెండు బ్లాకులు కలిసి ఓ ప్రత్యేక కొడంగల్ నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేశారు.

దాంతో కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్, దామరగిద్ద మొత్తం ఆరు మండలాలు కలిసి ఉండేవి. ఏపీ ప్రభుత్వంలో అసెంబ్లీల ప్రక్షాళన నిర్వహించిన సమయంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి దామరగిద్ద ప్రాంతం నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలో కలిసి 5 మండలాలతో కొడంగల్ నియోజకవర్గం ఏర్పడింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ జిల్లాల విభజన చేపట్టారు. దాంతో కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలు వికారాబాద్ జిల్లాలో, కోస్గి, మద్దూర్ మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో విలీనమయ్యాయి. జిల్లాలు వేరైనా ప్రస్తుతం కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాలు కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.

2014కు ముందు..
2014 సంవత్సరం కంటే ముందు కొడంగల్ నియోజకవర్గం అన్నింటా వెనుకబడి ఉండేది. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం మరింత వెనుకబాటులో ఉండిపోయింది. పెద్ద జిల్లా, సహజవనరులు తక్కువగా ఉండటంతో జిల్లా వెనుకబాటును చవిచూసింది. జిల్లాల విభజనతో కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ కొత్త జిల్లాలో విలీనం కావడంతో కొడంగల్ అభివృద్ధికి నాంది పడింది. 2014కు ముందు ఏపీ పాలనలో నిధులు అందించే వారు కరువు కావడంతో కొడంగల్‌లో ఎటువంటి అభివృద్ధి పనులు జరుగలేదు. రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఉండేది. వెనుకబడ్డ కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం కేసీఆర్‌ను రెండు జిల్లాల మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి కోరడంతో స్పందించిన సీఎం సంక్రాంతి పర్వదినాన వరాల జల్లులను కురిపించారు.

నియోజకవర్గానికి భారీగా నిధులు
వెనుకబడ్డ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు, మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో నిధులు మంజూరు చేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ.39 కోట్లతో 140 చెరువుల మరమ్మతులు, రూ.84 కోట్లతో పంచాయతీరాజ్ పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణానికి, రూ.325 కోట్లతో బీజాపూర్-హైదరాబాద్ హైవేరోడ్డు నిర్మాణ పనులు, కోటితో 10 వేల విద్యుత్ స్తంభాలు, రూ.12 కోట్లతో 6 సబ్‌స్టేషన్లు, రూ.2 కోట్లతో 750 ట్రాన్స్‌ఫార్మర్లు, రూ.70 కోట్లతో బీసీ, ఎస్సీ మైనార్టీ గురుకుల పాఠశాలలు మొత్తం రూ.300 కోట్లకు సంబంధించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దౌల్తాబాద్ మండలంలోని చెరువు రూ.7 కోట్ల 14 లక్షలతో మినీ ట్యాంక్‌బాండ్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి.

కోస్గిలో బస్‌డిపో, కోస్గి బస్టాండ్ మరమ్మతుతో పాటు మద్దూర్ మండల కేంద్రలోని బస్టాండ్ మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. రైతుబంధు పథకం కింద 37,810 మందికి రూ.47 కోట్ల 14 లక్షలు మంజూరు, 850 మందికి రూ.5 కోట్లతో షాదీముబారక్, 216 గ్రామాలకు తాగునీటి సౌకర్యాలకు గాను రూ.167 కోట్లతో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. కోస్గి, మద్దూర్ మండలాల్లో రూ.100 కోట్లతో 133 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు పనులు కొనసాగుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు నిధుల మంజూరుకు నివేదిక అందించడంతో స్పందించిన ఆయన వెంటనే కొడంగల్‌కు రూ.15 కోట్లు, కోస్గికి రూ.15 కోట్లు మంజూరు చేశారు.

56 కొత్త పంచాయతీలు
ప్రతి 500 జనాభా కలిగిన గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా కొడంగల్ నియోజకవర్గ పరిధలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండల పరిధిలో మొత్తం 56 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇందులో 29 గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. బొంరాస్‌పేట మండలంలో 21 గిరిజన పంచాయతీలు కొత్తగా రూపుదిద్దుకున్నాయి. కొత్తగా ఏర్పడిన గిరిజన తండాల్లో జూన్ 2వ తేదీన నూతనోత్సహంతో కొత్త పంచాయతీలకు ఆహ్వానం పలికారు. అదేవిధంగా కొడంగల్, కోస్గి రెండు మండలాలు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. ప్రతి పంచాయతీ గ్రామానికి బీటీ రోడ్లు మంజూరై పనులు కొనసాగుతున్నాయి.

బలపడ్డ టీఆర్‌ఎస్
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆయా పార్టీల నాయకులు ఆకర్శితులై స్వచ్ఛందంగా గత సంవత్సరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా పార్టీల నుంచి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పెద్ద ఎత్తున తరలిరావడంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ బలాన్ని పుంజుకుంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి నేటికీ పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్‌రెడ్డిని ప్రకటించడంతో గులాబీ శ్రేణులతో పాటు ప్రజల్లో నూతనోత్తేజం నెలకొంది. స్థానికంగా అందుబాటులో లేని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తి కావాలని ప్రజలు కోరుతున్న సమయంలో సీఎం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి మారుపేరుగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ను మరోమారు ఆశీర్వదించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. రైతులు, మహిళలు, చేతి వృత్తులు, ఆయా కుల సంఘాలు తదితరులు ఉత్సాహంతో కొడంగల్‌లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం చెప్పుకోదగ్గ విషయం.

అట్టహాసంగా ప్రారంభమైన ప్రచారం
కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్‌రెడ్డిని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల ప్రచారం హోరెత్తుతున్నది. శనివారం ప్రారంభించిన ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకుంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ, డప్పుచప్పుళ్ల నడుమ నరేందర్‌రెడ్డికి భారీగా స్వాగతాన్ని పలికారు. బొంరాస్‌పేటలోని పోలెపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొడంగల్‌లోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచార యాత్రను ప్రారంభించారు. ప్రచార యాత్ర కొడంగల్‌లోని ఐదు మండలాల్లో పెద్ద ఎత్తున కొనసాగింది.

రేవంత్‌రెడ్డిపై ప్రజల నిరుత్సాహం
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తాడని ఇక్కడి ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డిని గెలిపించారు. కానీ రెండు పర్యాయాల్లో కొడంగల్‌కు పట్టుమని 100 సార్లు కూడా వచ్చిన సందర్భాలు లేవని ప్రజలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అవసరం ఉన్న సందర్భంలోనే కొడంగల్ గుర్తుకు రావడం, వచ్చిన సందర్భంలో హడావుడిని సృష్టించి వెళ్లిపోవడం నైజంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఉండాలని, రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు పరిమితమై అక్కడి నుంచే రాజకీయాలను నడుపడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన స్వప్రయోజనాలకు మాత్రమే కొడంగల్‌ను వాడుకుంటున్నారని, కొడంగల్ ప్రజల బాధలు ఆయనకు పట్టవంటున్నారు. గత ఎన్నికల్లో కొడంగల్ ప్రజలకు సాగునీటి ప్రాజెక్టు, ఉద్యోగాల కల్పన, సిమెంటు ఫ్యాక్టరీ, రైలు మార్గాన్ని అందిస్తానని భారీ స్థాయిలో కటౌట్‌లు పెట్టుకొని ప్రచారం చేసుకున్నారని, కానీ అందులో ఏ ఒక్కటీ సాధ్యపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా ఎదిగేందుకే కొడంగల్ ప్రజలను అడ్డుపెట్టుకుంటున్నారని, రాష్ట్ర రాజకీయాలపై చూపుతున్న శ్రద్ధ కొడంగల్‌పై చూపడం లేదని ఆరోపిస్తున్నారు.

237
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...