నడ్డి విరుస్తున్న పెట్రో ధరలు


Sun,September 9, 2018 11:26 PM

-సామాన్యుడిపై ఇంధన భారం
-పది నెలల్లో పెట్రోలుపై రూ.13, డీజిల్‌పై రూ.15 పెంపు
-సెప్టెంబరు నెలలో రూ.2 పెరిగిన పెట్రోలు ధర
-చోద్యం చూస్తున్నకేంద్రం ప్రభుత్వం
-తగ్గించాలని కోరుతున్న ప్రజలు
బొంరాస్‌పేట : ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణను గాలికి వదిలేసింది. కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిలు ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సెప్టెంబరు నెలలో వరుసగా తొమ్మిది రోజుల్లో ఏకంగా తొమ్మిది సార్లు ధరలు పెంచారు. ఈ నెలలోనే పెట్రోలు ధర లీటరుకు రూ.2లు పెరిగింది. పెరిగిన ధరల ప్రభావం ప్రతి ఒక్కరిపై ఏదో ఒక రకంగా పడుతుంది. గత ఏడాది అక్టోబరులో రూ.73.64లు ఉన్న లీటరు పెట్రోలు ధర ఇప్పుడు రూ.85.23కు చేరింది. డీజిలు ధర రూ.63.04 నుంచి రూ.78.87కు చేరింది. పెరుగుతున్న ఇంధన ధరలపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. నాలుగేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం సామాన్యుల కష్టాలను తొలగిస్తుందని ఆశించగా ఇప్పుడు ఇంధన ధరలను పెంచి మోయలేని భారం మోపుతున్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోలు ధరలు పెరగడంతో ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆటో లు నడుపుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. పెరుగుతున్న డీజిలు ధరల కారణంగా తమకు ఏమీ లాభం మిగలడం లేదని వాపోతున్నారు. ఆర్టీసీ బస్సుల చార్జీలకు అనుగుణంగానే ఆటోల చార్జీలను వసూలు చేస్తున్నారు. డీజిలు ధరలు పెరిగాయని ఆటోలకు చార్జీలు పెంచితే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులకు మళ్లుతారని అభిప్రాయపడుతున్నారు. లారీలు, ప్రవేటు వాహనాల యజమానులు కూడా పెరిగిన ధరలతో వాహనాలు నడపలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిలు ధరలు పెరిగినా చాలా ఏళ్ల కిందట ఇస్తున్న కిరాయిలనే ఇస్తున్నారని దీనివల్ల తమకు ఏమాత్రం గిట్టుబాలు కావడం లేదని అంటున్నారు.

నిత్యావసరాలపై ప్రభావం
పెరిగిన పెట్రోలు, డీజిలు ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతున్నది. రెండు నెలల కిందట ఉన్న ధరలు ఇప్పుడు రెట్టింపయ్యాయి. పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు ఇతర నిత్యావసర వస్తులు లారీలలో ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. ధరలు పెరగడంతో వాహన యజమానులు కూడా సరుకు రవాణా చార్జీలను పెంచుతున్నారు. దీంతో వ్యాపారులు కూడా ధరలను పెంచి సామాన్యులకు అమ్ముతున్నారు. పెట్రో ధరలకు కేంద్రం ఇప్పటికైనా కళ్లెం వేయకపోతే భవిష్యత్తులో సామాన్యుల నుండి తిరుగుబాటు తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...