గెలుపు వేగం


Sat,September 8, 2018 12:09 AM

- జిల్లాలో టీఆర్‌ఎస్‌దే హవా
- నాలుగు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్సే దూకుడు
- సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సబ్బండ వర్గాల మద్దతు
- తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం
- కొడంగల్‌లో బలంగా గులాబీ పార్టీ
- ఈ దఫా ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డికే పట్టం
- రేవంత్‌రెడ్డి అడ్రస్ గల్లంతే అంటున్న విశ్లేషకులు
- పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డివైపే ప్రజలు
- వికారాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రానున్న ఎన్నికల్లో జిల్లాలో గులాబీ పార్టీదే హవా కొనసాగనుంది. జిల్లాలో రాజకీయంగా మిగతా అన్ని పార్టీల కంటే బలంగా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ పాగా వేయనుంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో అనతికాలంలోనే బలమైన పార్టీగా ఎదిగింది. ఏ ఎన్నికలు జరిగినా విజయభేరి మోగిస్తున్న టీఆర్‌ఎస్ రాబోయే ఎన్నికల్లోనూ అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలుపొంద నుంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జిల్లాలో గులాబీ పార్టీ దూకుడు ఇంకా పెరిగిందనే చెప్పాలి. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత పేద ప్రజల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టడంతో అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకే జై కొడుతున్నారు. ప్రధానంగా ఎన్నో ఏండ్లుగా ప్రత్యేక జిల్లా కోసం చేస్తున్న ప్రజల పోరాటాన్ని గుర్తించి జిల్లాను ఏర్పాటు చేయడంతో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు చూసినా, గులాబీ పార్టీకి తిరుగులేదనే చెప్పవచ్చు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

4 నియోజకవర్గాల్లోనూ గెలుపు ఖాయం
రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 4నియోజకవర్గాల్లోనూ విజయభేరి మోగించడం ఖాయం. తాండూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న పట్నం మహేందర్ రెడ్డి ఐదోసారి గెలవడం పక్కా అని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని అర్హులైన ప్రజలందరికీ అందించడంలో ముందున్న మహేందర్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉండడంతో గెలుపు సునాయాసం. నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా, అన్న అంటే నేనున్నా అని అండగా నిలిచే మహేందర్ రెడ్డివైపే నియోజకవర్గ ప్రజానీకం నిలుస్తున్నది. అంతేకాకుండా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో రెండు, మూడు గ్రూపులుండడం కూడా మహేందర్ రెడ్డికి మరోసారి కలిసిరానుంది.

కొడంగల్ నియోజకవర్గం : ఈ నియోజకవర్గానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించిన నరేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం పొందారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీలో ఉన్న గుర్నాథ్ రెడ్డి కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి నరేందర్‌రెడ్డి గెలుపునకు మద్దతిస్తుండడంతో కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పాగా వేయడం ఖాయమైనట్లే. కొడంగల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలువాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా పక్కాప్లాన్‌తో ముందుకెళ్తున్నది. అంతేకాకుండా రేవంత్‌రెడ్డి చిల్లర చేష్టలకు విసుగుచెందిన నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో అతన్ని ఓడించి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి ప్రజలను రెచ్చగొట్టేందుకు మాయమాటలతో కాలం వెల్లదీస్తున్న రేవంత్‌కు ఈసారి ఎన్నికల్లో ప్రజల నుంచి చేదు అనుభవమే ఎదురుకానుంది. ఇప్పటికే ఓటమి భయంతో మరో నియోజకర్గం నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమంటున్నారు ప్రజలు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై జైలుకెళ్లొచ్చిన రేవంత్‌ను ఈ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ప్రజలు సాగనంపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఒక్క కొడంగల్ నియోజకవర్గానికే రూ.100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డివైపే ప్రజలు నిలుస్తున్నారు.

పరిగి నియోజకవర్గం : ఈ నియోజకవర్గానికి సంబంధించి టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పెద్ద కుమారుడు కొప్పుల మహేశ్‌రెడ్డిని పార్టీ అధిష్టానం బరిలో దింపింది. గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన హరీశ్వర్‌రెడ్డి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు ఈదఫా ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మహేశ్‌రెడ్డినే గెలిపించి ఆశీర్వదించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది కాలంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువైన యువ నేత మహేశ్‌రెడ్డి గెలుపు ఖాయమైనట్లే. అటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన టీ.రామ్మోహన్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో చేదు అనుభవమే ఎదురుకానుంది. నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసినా తన వల్లే అభివృద్ధి జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేసే రామ్మోహన్ రెడ్డిపట్ల విసుగు చెందిన పరిగి నియోజకవర్గ ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలంతా మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే అయిన రామ్మోహన్ రెడ్డి సొంత గ్రామానికి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలను సైతం టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని ఆయనకు షాకిచ్చారు మహేశ్‌రెడ్డి. ఏదేమైనా పరిగి నియోజకవర్గంలో మహేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారు. అటు వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండడం టీఆర్‌ఎస్ పార్టీకి కలిసిరానుంది. అభ్యర్థి ఎవరైనప్పటికీ గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌నే వరించనుంది.

జిల్లాలో గులాబీ పార్టీ దూకుడు...
వికారాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో బలంగా తయారైంది. ఒకప్పుడు అస్సలు క్యాడర్‌లేని పార్టీకి ప్రస్తుతం పూర్తి క్యాడర్‌తో కూడుకొని ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. మిగతా పార్టీల బలం అంతంతాగానే ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆ పార్టీ అధినేత తెలంగాణ రాష్ర్టాన్ని అడ్డుకునేందుకుగాను కేంద్రానికి లేఖ రాయడంతోనే జిల్లాలో టీడీపీ పూర్తిగా పతనమైంది. అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పుట్టిన టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడం, రాష్ర్టాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరించడంతో ప్రజలంతా గులాబీ పార్టీ వైపు నిలిచారు. అటు ప్రత్యక్ష ఎన్నికల్లోనూ, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయకేతనం ఎగురవేసిన టీఆర్‌ఎస్ పార్టీ అతని కాలంలోనే ప్రజల మన్ననలను పొంది ఎదురులేని శక్తిగా ఎదిగింది. అయితే జిల్లా పరిధిలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందగా, పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్, కొడంగల్‌లో టీడీపీ గెలుపొందింది.

అదేవిధంగా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీకే మెజార్టీ ఉంది. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీపీలకు సంబంధించి పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూర్, వికారాబాద్, మర్పల్లి, బంట్వారం, ధారూర్, మోమిన్‌పేట్, నవాబుపేట్, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, దౌల్తాబాద్ మండలాల్లో ఉన్నారు. అదేవిధంగా జడ్పీటీసీలకు సంబంధించి జిల్లాలో బొంరాస్‌పేట్ మండలం మినహాయిస్తే జిల్లాలోని పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూర్, వికారాబాద్, మర్పల్లి, బంట్వారం, ధారూర్, మోమిన్‌పేట్, నవాబుపేట్, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, దౌల్తాబాద్, కొడంగల్, గండీడ్ మండలాల్లో టీఆర్‌ఎస్ జడ్పీటీసీలు కొనసాగుతున్నారు. ముఖ్యంగా పరిగి నియోజకవర్గంలోని ఎంపీపీలుగాని, జడ్పీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన వారుకాగా, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో మాత్రం జడ్పీటీసీలు, ఎంపీపీలు తొలుత ఇతర పార్టీ నుంచి గెలుపొందినప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీవైపు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో అయితే నవాబుపేట్, మోమిన్‌పేట్, బంట్వారం, మర్పల్లి మండలాల్లో కాంగ్రెస్ తరపున జడ్పీటీసీలుగా ఎన్నికైనప్పటికీ అనంతరం గులాబీ పార్టీలో చేరారు. ఎంపీటీసీలు, సర్పంచులకు సంబంధించి పరిగి నియోజకవర్గంలో మొత్తం 83 మంది ఎంపీటీసీలుకాగా వీరిలో 52మంది ఎంపీటీసీలు, 118 గ్రామ పంచాయతీలకుగాను 85 గ్రామ పంచాయతీలకు టీఆర్‌ఎస్ వారే సర్పంచులుగా గెలుపొందారు. వికారాబాద్ నియోజకవర్గంలో 66ఎంపీటీసీలకుగాను 47 మంది ఎంపీటీసీలు, 61 మంది సర్పంచులు టీఆర్‌ఎస్‌వారే గెలుపొందారు.


పరిగి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ చిత్రం
పరిగి అసెంబ్లీ నియోజకవర్గం : జనరల్ స్థానం
నియోజకవర్గం పరిధిలోని మండలాలు : పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు
మొత్తం ఓటర్లు : 2,18,086
పురుషులు : 1,12,045
మహిళా ఓటర్లు : 1,06,030
ఇతరులు : 11
పరిగి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలు
1952-ఎస్.కె.బేగం (ఏకగ్రీవం)
1957-జగన్‌మోహన్‌రెడ్డి (స్వతంత్ర)
1962-రాందేవరెడ్డి (కాంగ్రెస్)
1967-కమతం రాంరెడ్డి (ఇండిపెండెంట్)
1972-కమతం రాంరెడ్డి (కాంగ్రెస్)
1978-అహ్మద్ షరీఫ్ (కాంగ్రెస్)
1983-అహ్మద్ షరీఫ్ (కాంగ్రెస్)
1985-కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (తెలుగుదేశం పార్టీ)
1989-కమతం రాంరెడ్డి (కాంగ్రెస్)
1994-కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (తెలుగుదేశం పార్టీ)
1999-కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (తెలుగుదేశం పార్టీ)
2004-కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (తెలుగుదేశం పార్టీ)
2009-కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (తెలుగుదేశం పార్టీ)
2014-టి.రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్)

వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ చిత్రం
వికారాబాద్ నియోజకవర్గం : ఎస్సీ రిజర్వేషన్1962న ఏర్పాటు
నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య : 2,00,117
పురుషుల ఓటర్లు : 1,02,265,
మహిళా ఓటర్లు : 97,793
ఇతరులు : 14
పోలింగ్ కేంద్రాల సంఖ్య : 272
నియోజకవర్గం గెలుపొందిన ఎమ్మెల్యేల వివరాలు
1952-(ద్వి శాసన సభ) డాక్టర్ మర్రిచెన్నారెడ్డి, అరిగె రామస్వామి (కాంగ్రెస్)
1957-(ద్వి శాసన సభ) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, అరిగె రామస్వామి (కాంగ్రెస్)
1962- అరిగె రామస్వామి(ఎస్సీ రిజర్వుడ్) (కాంగ్రెస్)
1967-అరిగె రామస్వామి (కాంగ్రెస్)
1972- వీబీ తిరుమలయ్య (స్వతంత్ర)
1978 -వీబీ తిరుమలయ్య(కాంగ్రెస్)
1983- కే.ఆర్.కృష్ణస్వామి (కాంగ్రెస్)
1985-డాక్టర్ ఏ.చంద్రశేఖర్ (టీడీపీ)
1989-డాక్టర్ ఏ.చంద్రశేఖర్ (టీడీపీ)
1994-డాక్టర్ ఏ.చంద్రశేఖర్ (టీడీపీ)
1999 -డాక్టర్ ఏ.చంద్రశేఖర్ (టీడీపీ)
2004- డాక్టర్ ఏ.చంద్రశేఖర్ (టీఆర్‌ఎస్)
2008 - జి.ప్రసాద్‌కుమార్ (ఉప ఎన్నిక)కాంగ్రెస్
2009 -జి.ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్)
2014- బి.సంజీవరావు (టీఆర్‌ఎస్)


తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ చిత్రం
తాండూరు నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది.
తాండూరు నియోజకవర్గంలో మండలాలు : తాండూరు, పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్
మొత్తం ఓటర్ల సంఖ్య : 1,90,360
పురుషులు : 93,677
మహిళలు : 96,673
ఇతరులు : 10 తాండూరు

నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారి వివరాలు...
1952 - ప్రాణేష్‌చారి (కాంగ్రెస్)
1957 - ప్రాణేష్‌చారి (కాంగ్రెస్)
1962 - మర్రి చెన్నారెడ్డి (కాంగ్రెస్)
1967 - మర్రి చెన్నారెడ్డి (కాంగ్రెస్)
1969 - ఎం.మాణిక్‌రావు (కాంగ్రెస్)
1972- ఎం.మాణిక్‌రావు (కాంగ్రెస్) ఏకగ్రీవం
1977 - ఎం.మాణిక్‌రావు (కాంగ్రెస్)
1983- ఎం.మాణిక్‌రావు (కాంగ్రెస్)
1985- ఎం.చంద్రశేఖర్ (కాంగ్రెస్)
1989- ఎం.చంద్రశేఖర్ (కాంగ్రెస్)
1994- పి.మహేందర్‌రెడ్డి (టీడీపీ)
1999- పి.మహేందర్‌రెడ్డి (టీడీపీ)
2004- ఎం.నారాయణరావు (కాంగ్రెస్)
2009- పి.మహేందర్‌రెడ్డి (టీడీపీ)
2014- పి.మహేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్)

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ చిత్రం
కొడంగల్ నియోజవర్గం 1952లో ఏర్పడింది
మొత్తం ఓటర్లు : 1,89,078
పురుషులు : 94,257
మహిళలు : 94,803
ఇతరులు : 18
కొడంగల్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల వివరాలు
1952- అనంత్‌రెడ్డి (వీరస్వామి కాంగ్రెస్ పార్టీ)
1962- రుక్మారెడ్డి (స్వతంత్య్ర అభ్యర్థి)
1967- కే.అచ్చుతారెడ్డి (కాంగ్రెస్)
1972- నందారం వెంకటయ్య (స్వతంత్య్ర అభ్యర్థి)
1978- గుర్నాథ్‌రెడ్డి (స్వతంత్య్ర అభ్యర్థి)
1983- గుర్నాథ్‌రెడ్డి (కాంగ్రెస్ పార్టీ)
1985- నందారం వెంకటయ్య (తెలుగుదేశం పార్టీ)
1989- గుర్నాథ్‌రెడ్డి (కాంగ్రెస్ పార్టీ)
1994- నందారం వెంకటయ్య (తెలుగుదేశం పార్టీ)
1996- మధ్యంతర ఎన్నికల్లో నందారం సూర్యనారాయణ (తెలుగుదేశం పార్టీ)
1999- గుర్నాథ్‌రెడ్డి (కాంగ్రెస్ పార్టీ)
2004- గుర్నాథ్‌రెడ్డి (కాంగ్రెస్ పార్టీ)
2009- రేవంత్‌రెడ్డి (తెలుగుదేశం పార్టీ)
2014- రేవంత్‌రెడ్డి (తెలుగుదేశం పార్టీ)
(ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలు వికారాబాద్ జిల్లాలో ఉండగా, కోస్గి, మద్దూరు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నాయి.)

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...