జోరుగా ‘తెల్ల బంగారం’ కొనుగోళ్లు


Sat,December 14, 2019 10:50 PM

-హుస్నాబాద్ నియోజక వర్గంలో3000 మంది రైతుల నుంచి పత్తి సేకరణ
- మద్దతు ధర వస్తుండటంతో సీసీఐలోనే విక్రయించేందుకు రైతుల ఆసక్తి
-15 రోజులుగా ఊపందుకున్న కొనుగోళ్లు
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభమైన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తెల్లబంగారమైన పత్తి కొనుగోళ్లు జోరంందుకున్నాయి. పత్తికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం, బయట మార్కెట్‌లో ధర పలకక పోవడంతో రైతులందరూ సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే తమ పంటను విక్రయించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో సీసీఐ కొనుగోళ్ల కోసం కేటాయించిన జిన్నింగ్ మిల్లుల్లో సందడి నెలకొంది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాల ద్వారా రైతులు పత్తిని తెస్తున్నారు. సీసీఐ కొనుగోళ్ల కోసం పట్టణ శివారులోని ఐదు మిల్లులను ఎంపిక చేశారు. వీటిల్లో ప్రతి రోజు సగటున 4,500క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ పత్తి ధర రూ.5.550ల కనీస మద్దతు ధర ఉండడంతో రైతులు ఉత్సాహంగా కొనుగోలు కేంద్రానికి వచ్చి పత్తిని అమ్ముతున్నారు. నవంబర్ 14న హుస్నాబాద్ మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ అకాల వర్షాల కారణంగా పత్తి అంతగా మార్కెట్‌కు రాలేదు. గడిచిన 15 రోజులగా పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు రైతులు పత్తిని తెచ్చి విక్రయిస్తున్నారు.

- 42వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు...
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఇప్పటి వరకు సీసీఐ ద్వారా సుమారు 3 వేల మంది రైతుల నుంచి 42వేల క్వింటాళ్ల పత్తిని అధికారులు కొనుగోలు చేశారు. సీసీఐ కొనుగోళ్లు చేస్తున్న పత్తి.. జిన్నింగ్ మిల్లువారీగా కొనుగోళ్లను పరిశీలిస్తే..గోమాత జిన్నింగ్ మిల్లులో 677మంది రైతుల నుంచి 9,148.70 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. అలాగే, మహాలక్ష్మి మిల్లులో 367మంది రైతుల నుంచి 5,596.80 క్వింటాళ్లు, ఆర్‌కే మిల్లులో 790 మంది నుంచి 10,280,50 క్వింటాళ్లు, శ్రీబాలాజీ మిల్లులో 530 మంది రైతుల నుంచి 7,983.85 క్వింటాళ్లు, రాజరాజేశ్వర మిల్లులో 589 మంది రైతుల నుంచి 8,558 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. పత్తిలో 8 నుంచి 12 శాతంలోపు తేమ ఉన్న రైతులకు మద్దతు ధర పూర్తిస్థాయిలో పడుతోంది. ఒక్కో జిన్నింగ్ మిల్లులో ఐదుగురు సీసీఐ అధికారులు, సిబ్బంది అందు బాటులో ఉండి కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పత్తి కొనుగోళ్లతో జిన్నింగ్ మిల్లుతోపాటు వేయింగ్ బ్రిడ్జిలు సందడిగా మారాయి.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...