1953 మంది పోలీసులతో గట్టి బందోబస్తు


Wed,December 11, 2019 04:09 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : ములుగు, గజ్వేల్‌లో ఫారెస్టు కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, స మీకృత మార్కెట్ యార్డు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్స్, మహతి ఆడిటోరియం ప్రారంభోత్సవాలకు బుధవారం సీఎం కేసీఆర్ వస్తున్నందున గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ చెప్పారు. గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్‌లో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ జోయల్ డెవిస్ మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు. వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు పాసులు ఇచ్చామని, వారి పాసులు తనిఖీ చేసి ప్రారంభోత్సవ స్థలానికి అనుమతి ఇవ్వాలన్నారు. పోలీసులందరూ అలర్ట్‌గా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజాప్రతినిధులు పోలీసు వారి సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు.
1953 మందితో బందోబస్తు
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాకు వచ్చిన మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, మెదక్ జిల్లాల నుంచి బందోబస్తుకు పోలీసులు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ పర్యటన ముగిసే వరకు పోలీసులందరూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. మొత్తం బందోబస్తును 33 సెక్టార్లుగా విభజించారు. అడిషనల్ ఎస్పీలు ఐదుగురు, ఏసీపీలు 22 మంది, సీఐలు 80 మంది, ఏఎస్‌ఐలు 100 మంది, ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 106 మంది, కానిస్టేబుళ్లు, హోంగార్డులు 1520 మంది, మహిళా హోంగార్డులు 120 మంది, అదే విధంగా రోప్, స్పెషల్ పార్టీలు ఇలా మొత్తం 1953 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

పార్కింగ్ ప్రదేశాలు
సీఎం కేసీఆర్ పర్యటన పురస్కరించుకొని ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు వాహనదారుల కోసం ఏర్పాటు చేశామని సీపీ జోయల్ డెవిస్ చెప్పారు. మదీనా మసీద్ గ్రౌండ్, ఎస్‌బీఐ బ్యాంకు పక్కన, సంతోషిమాతా టెంపుల్ గ్రౌండ్, సాయిబాబా టెంపుల్ గ్రౌండ్, పీఎన్‌ఆర్ గార్డెన్, డెయిరీ మిల్క్ విక్రయ కేంద్రం, ముట్రాజ్‌పల్లి రోడ్లలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. వాహనదారులందరూ పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్కు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తారని సీపీ జోయల్ డెవిస్ వివరించారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ నర్సింహారెడ్డి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అడిషనల్ ఎస్పీలు, గజ్వేల్ ఏసీపీ నారాయణ, ఏసీపీలు రామేశ్వర్, శ్రీనివాస్, బాలాజీ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...