దేశానికే ఆదర్శం గజ్వేల్


Wed,December 11, 2019 04:08 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ/ములుగు: అభివృద్ధిలో గజ్వేల్ దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా మంగళవారం సాయంత్రం గజ్వేల్‌లో, రాత్రి ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అంతకుముందు గజ్వేల్‌లో వివిధ అభివృద్ధి పనుల ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో ఐవోసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే, మంత్రి నిరంజన్‌రెడ్డి గజ్వేల్, ములుగులో సీఎం పర్యటనపై ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్ ఒకప్పటి రూపురేఖలు పూర్తిగా మారాయని, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా మారిందన్నారు. మిషన్‌భగీరథ పథకంతో రాష్ట్ర ప్రజల దాహం తీరగా, తాగునీటి రూపంలో సీఎం కేసీఆర్ ప్రజలకు కనిపిస్తున్నాడన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలువగా, ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు సమకూరుతున్నాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కలనా? నిజమా? అనే విధంగా గజ్వేల్ నియోజకవర్గ స్వరూపం మారడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. బుధవారం ములుగులో అటవీశాఖ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఇది తమిళనాడు తర్వాత మన రాష్ట్రంలోనే అధునాతన సౌకర్యాలతో నిర్మించారన్నారు. ఇకనుంచి రాష్ట్రం నుంచే ఐఎఫ్‌ఎస్ అధికారులు పట్టా అందుకొని, విధుల్లో చేరుతారన్నారు. ములుగులో సకల సౌకర్యాలతో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం, గజ్వేల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారన్నారు. రూ.100 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రూ.32 కోట్లతో మాతా శిశు సంక్షేమ దవాఖానకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు నాలుగు గంటలు సీఎం గజ్వేల్‌లో ఉంటారన్నారు. మహతి ఆడిటోరియంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహిస్తారన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. పోలీసులు, అధికారులకు సహకరించాలని, పాసులు ఉన్న వారే మహతి సమావేశంలో పాల్గొనాలన్నారు. మంత్రుల వెంట కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జేసీ పద్మాకర్, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మల్లేశం, ఎంపీపీ అమరావతి, నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్, ఊడెం కృష్ణారెడ్డి, బక్కి వెంకటయ్య, మాదాసు శ్రీనివాస్, బెండ మధు, ఆకుల దేవేందర్, టీఆర్‌ఎస్ ములుగు మండలాధ్యక్షుడు జహంగీర్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బట్టు అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు జుబేర్‌పాషా, వైస్ ఎంపీపీ వీరన్నగారి దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...