వీధివీధినా పూల మొక్కలు


Thu,December 5, 2019 01:01 AM

-జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నాటింపు
-మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో తీసుకొచ్చిన అధికారులు
-ఇప్పటికే 70శాతం వీధుల్లో నాటడం పూర్తి
-మూడేళ్లలో పూలవనంగా మారనున్న భానుపురి

సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గత ఉమ్మడి రాష్ట్రంలో అడవులు లేక పచ్చదనం కనిపించక వర్షాభావ పరిస్థితులతో ప్రజలకు నిలువ నీడ లేని పరిస్థితి నెలకొని ఉండేది. వాస్తవానికి మొత్తం భూ విస్తీర్ణంలో 33శాతం అడవులు ఉండాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో మూడు శాతం కూడా లేని దుస్థితి ఉంది. ప్రధానంగా గత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6శాతం మాత్రమే ఉండగా రాష్ట్రంలోనే అతి తక్కువ అడవి 3శాతంగా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో ఉండగా అది కూడా రికార్డులకే పరిమితమై ఉంది. వాస్తవానికి జిల్లాలో ఒక శాతం మాత్రమే అడవి ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడవుల పెంపకంపై దృష్టి సారించి అందరినీ భాగస్వాములను చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు నాలుగు విడుతలు పూర్తి కాగా ప్రస్తుతం ఐదో విడుత కొనసాగుతోంది. జిల్లాలో లక్షలాది మొక్కలు నాటగా గ్రామాల్లో ఎవెన్యూ ప్లానిటేషన్‌ విరివిగా కనిపిస్తోంది. మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో సైతం రోడ్లకు ఇరువైపులా నీడను ఇచ్చే వాటితోపాటు పూల మొక్కలు పెద్ద ఎత్తున నాటారు.


మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో..
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు... కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ చొరవతో సూర్యాపేట పట్టణంతోపాటు మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లోని అన్ని వీధుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ దాదాపు ఐదు నుంచి ఆరు మీటర్ల ఎత్తు ఉన్న అత్యంత అరుదైన, ప్రైవేట్‌ మార్కెట్‌లో ఖరీదైన కదంబ, జకరండా, టబూబియా, పొగడ, రోసియా తదితర మొక్కలు కొనుగోలు చేసి నాటారు. మిగిలిన చోట్ల కానుగ ఇతర మొక్కలు పెరుగుతున్నాయి. వీటిని మున్సిపల్‌ డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా ట్యాంకర్లను కొనుగోలు చేయగా నిత్యం కార్మికులు నీళ్లు పోస్తుండడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. వచ్చే రెండు నుంచి మూడేళ్లలో ఆయా రకాల మొక్కలు పదిహేను నుంచి ఇరవై మీటర్ల ఎత్తుకు గుబురుగా పెరిగి పూలు పూస్తాయని డీఎఫ్‌ఓ తెలిపారు. రానున్న మూడేళ్లలో వీధులన్నీ కనువిందు చేయనున్నాయి.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...