దాడులపై పిల్లలకు అవగాహన కల్పించాలి


Thu,December 5, 2019 12:52 AM

-కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
సూర్యాపేట, నమస్తేతెలంగాణ : ఇటీవల కాలంలో మహిళలు, యువతులపై లైంగికదాడులు జరుగుతున్నాయని, మహిళలపై దాడులకు పాల్పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో మహిళల హక్కులు, చట్టాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌, జేసీ డి.సంజీవరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు.

ప్రతి కుటుంబంలోని పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు, బంధాలు, బాంధవ్యాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అర్బన్‌ ఏరియా, మండల, గ్రామస్థాయిలో పెద్దఎత్తున మహిళలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థినుల్లో ఆత్మైస్థెర్యం పెంపొందేలా, దాడులను ఎదుర్కొనేలా అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ఎస్పీ భాస్కరన్‌ మాట్లాడుతూ జిల్లాలో మహిళల రక్షణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల రక్షణకు షీటీం బృందాలు నిఘా పెట్టాయన్నారు. జిల్లాలో నిర్దేశించిన అన్ని ప్రాంతాల్లో పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, మహిళలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే 100కు కాల్‌ చేసినా, నేరుగా స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు చేపడుతామన్నారు.

అనంతరం పెట్రోల్‌ డీలర్లతో సమావేశమై పెట్రోల్‌, డీజిల్‌కు వచ్చే వాహనదారుల వాహనాలను తమ బంకుల్లో పార్కింగ్‌ చేయనీయరాదని సూచించారు. బాటిల్స్‌లో పెట్రోల్‌ కోసం వచ్చే వారిపై నిఘా ఉంచాలని డీలర్లను ఆదేశించారు. తూనికలు, కొలతలు, పౌరసరపరాల అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ పి.చంద్రయ్య, సీఈఓ విజయలక్ష్మి జిల్లా అటవీశాఖ అధికారి ముకుందారెడ్డి, డీపీఓ యాదయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...