పుస్తకాలు మంచి నేస్తాలు


Thu,November 14, 2019 11:35 PM

సిద్దిపేట టౌన్ : పుస్తకాలే మంచి నేస్తాలని.. పుస్తక పఠనంతో మేధస్సు పెరుగుతుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. చాలా మంది ఇక్కడి నుంచి ఉన్నతంగా ఎదిగారన్నారు. సిద్దిపేటలో అత్యాధునిక జిల్లా గ్రంథాలయాన్ని రూ.2 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. మార్చి కల్లా భవనాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అధునాతనంగా నిర్మిస్తున్న లైబ్రరీలో విద్యార్థులకు, మహిళలకు, పోటీ పరీక్షల వారి కోసం ప్రత్యేక బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా గ్రంథాలయ ఉద్యోగులకు, చైర్మన్‌కు ప్రత్యేక క్యాబిన్ నిర్మిస్తున్నామన్నారు. 53వ గ్రంథాలయ వారోత్సవాలు అక్కడే ఘనంగా జరుపుకుందామన్నారు. యువత సెల్‌ఫోన్ మోజులో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, సమయం వృథా చేస్తున్నారన్నారు. పుస్తకాలకు దగ్గరై సెల్‌ఫోన్‌కు దూరం కావాలని సూచించారు. కొత్తగా 7 మండలాల్లో నూతన గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. పాఠకులకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎవరు ఏది అడిగితే ఆ పుస్తకాన్ని అందించాలని గ్రంథాలయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. రూ.40 లక్షలతో కొత్త పుస్తకాలను తీసుకొస్తున్నామని చెప్పారు.

విద్యార్థులు కోరిన పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామన్నారు. పుస్తక పఠనంతో దేశం, ప్రపంచం, మన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవచ్చన్నారు. పాఠకుల సంఖ్యను పెంచాలని సూచించారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విద్యార్థులకు తెలియజేశారు. అంతకు ముందు జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా మన చరిత్ర, కథలు, ఇతిహాసాలు తెలుసుకోవచ్చన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నేటి సమాజం సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గ్రంథాలయాలకు పూర్వవైభవం తేవడానికి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర, వైస్ చైర్మన్ అక్తర్‌పటేల్, నాయకులు బ్రహ్మం, వాసవీ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీధర్, నవీన్‌కుమార్, లైబ్రేరియన్లు తిరుపతిరెడ్డి, రాజులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...