పవర్‌ఫుల్ పల్లెలు


Wed,November 13, 2019 11:46 PM

-పవర్‌వీక్‌తో కాంతులీనుతున్న గ్రామాలు
-పల్లె ప్రణాళికతో కరెంట్ కష్టాలకు చెల్లు
-విద్యుత్ దీపాల కోసం ప్రత్యేక లైన్లు
-ప్రతి గ్రామంలో వదులుగా ఉన్న వైర్లు బిగింపు
-ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగులు
-దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు
-మెరుగుపడిన విద్యుత్ సరఫరా
-అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో వంద శాతం సమస్యల పరిష్కారం
-సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు

కొమురవెల్లి : సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం రూపొందించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పల్లెల్లో కరెంట్ కష్టాలకు చెక్ పడింది. కొమురవెల్లి మండల వ్యాప్తంగా 11 గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇది వరకు గుర్తించిన సమస్యలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు విన్నవించిన సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటికి అనుగుణంగా పనులు చేపట్టడంతో పల్లెల్లో కరెంట్ కష్టాలు తొలిగి జిగేల్ జిగేల్ అంటూ వెలుగులు విరజిమ్ముతున్నాయి.

తప్పిన తిప్పలు..
గతంలో కొమురవెల్లి మండలంలో ఎప్పుడు గాలి దుమారం వచ్చిన.. వర్షం కురిసిన కరెంట్ కట్ అయ్యేది. ఎక్కువగా ఇనుప స్తంభాలతో పాటు లూజు వైర్ల సమస్య తీవ్రంగా ఉండడంతో తరచూ లోవోల్టేజీతో ప్యూజ్‌వైర్ కొట్టేయడంతో మండల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో పవర్‌వీక్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలు గుర్తించారు. మండల వ్యాప్తంగా 11 గ్రామాల్లో 20 కిలోమీటర్ల మేర లూజులైన్లను గుర్తించి 162 మిడిల్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా 75 వంగిన స్తంభాలను సరిచేయడంతో పాటు 32 ధ్వంసమైన, ఇనుపస్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా 42 స్తంభాలకు సపోర్టు వైర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగులు చేసి స్ట్రీట్ లైట్ల కోసం ప్రత్యేకంగా 26 కిలో మీటర్లు ధర్డ్ వైర్‌ను విస్తరించడంతో పాటు 107 స్ట్రీట్ మీటర్లు ఏర్పాటు చేశారు.\

గ్రామాల్లో కొత్త వెలుగులు..
సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆలోచన చేసిన 30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో ప్రవేశపెట్టిన పవర్‌వీక్ కార్యక్రమంతో కరెంట్ కష్టాలకు చెక్ పడింది. గ్రామాల్లో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలు 30 రోజుల ప్రణాళికతో పరిష్కారం కావడంతో పాటు ఊరూరా కొత్త వెలుగులు నింపింది. లూజులైన్లు, ఇనుప స్తంభాలు, ఎర్తింగ్ ఇతర సమస్యలు పరిష్కారమై, విద్యుత్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారడంతో పాటు మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందని గ్రామీణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో చాలా ప్రదేశాల్లో పవర్‌వీక్ కార్యక్రమంతో చీకట్లు తొలిగాయని చెబుతున్న గ్రామీణులు సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ
పవర్‌వీక్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని లెనినగర్‌లో పాటు పలు గ్రామాల్లో విద్యుత్ సీజీఎం పాండ్యానాయక్, ఎస్‌ఈ కరుణాకర్ బాబు, డీఈ రామచంద్రం గ్రామంలో పర్యటించి పనులను పరిశీలించారు. విద్యుత్ ఉన్నత అధికారుల నిరంతర పర్యవేక్షణతో మండలంలో విద్యుత్ సమస్యలను 100 శాతం పరిష్కరించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...