రోడ్లపై రాశులొద్దు..


Wed,November 13, 2019 01:47 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా పలు రోడ్లపైనే ధాన్యం రాశులు.. మూలమలుపులు.. కల్వర్టుల వద్ద.. ఇవేవి చూడకుండానే ఇష్టారీతిగా పలు రహదారులపై మొక్కజొన్న, వడ్లు, వరికుప్పలు వేస్తున్నారు. టార్ఫాలిన్‌ కవర్లు కప్పి పెద్ద రాళ్లు పెడుతున్నారు. రాత్రి వేళలో ఇవేవి కనబడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు సగ భాగం వరకు ధాన్యం రాశులు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జిల్లాలో ఓ రైతు ధాన్యం పోసి రోడ్డు పక్కన పడుకున్నాడు. అటుగా వచ్చిన వాహనం రైతుపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నాలుగేండ్లలో జిల్లాలో 31 ప్రమాదాలు జరిగాయి. రోడ్డుపై ధాన్యం పోసిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే రోడ్లపై ధాన్యంపోయకుండా సీపీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో ఇటీవల రోడ్‌ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంలో రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీనిని విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ, ఏఈవోల ఆధ్వర్యంలో రైతులకు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. వానకాలం పంటలు చేతికందే సమయంలో వర్షాలు పడుతుండడంతో ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టడానికి ఆయా ప్రాంతాల్లో ఉండే రైతులు పక్కనే ఉన్న రహదారులను ఎంచుకుంటున్నారు. దీన్ని నివారించడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది.

రోడ్డుపై ధాన్యం రాసులతో ప్రమాదాలు..
ప్రతి యేటా వానకాలం సీజన్‌ వచ్చిందంటే రోడ్లపై ధాన్యం రాశులు కనిపిస్తాయి. ఈ రాశుల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగిల్‌ రహదారులు ఉండడం వల్ల సగం వరకు ధాన్యమే నిండి ఉంటుంది. జిల్లాలో ప్రధానంగా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల తదితర ప్రాంతాల్లోని రహదారులపై మొక్కజొన్న, వరి, వరి కుప్పలతో పాటు కంది వచ్చే సమయంలో కంది కుప్పలు కూడా కనిపిస్తుంటాయి. కొన్ని గ్రామాల్లో రోడ్ల పైన కంది వేసి వచ్చిపోయే వాహనాల ద్వారా నూర్పిళ్లు చేస్తుంటారు. మొక్కజొన్న కంకులు నూర్పిడి కూడా రోడ్లపై జరుపుతున్నారు. మిరుదొడ్డి మండలంలోని పలు రహదారులపై ఎక్కడ చూసిన ధాన్యం రాశులే కనిపిస్తుంటాయి. తొగుట, సిద్దిపేట, గజ్వేల్‌, కోహెడ, మద్దూరు, చిన్నకోడూరు, నంగునూరు, దౌల్తాబాద్‌, రాయిపోల్‌ తదితర మండలాల్లో ఎక్కడా చూసిన రోడ్లపైన ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. ధాన్యం రాశులపై రాత్రిపూట టార్ఫాలిన్‌ కవర్లు వేస్తున్నారు. అవి కొట్టుకపోకుండా పెద్ద రాళ్లు వాటిపై పెడుతున్నారు. మరుసటి రోజు ధాన్యం తీశాక ఆ రోడ్లపై పెట్టినటువంటి రాళ్లను తీసేయకపోవడంతో రాత్రి వేళల్లో ఏం కనిపించకుండా రోడ్డుపై వెళ్లే వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది రైతులు, ప్రయాణికులు చనిపోయారు.

నాలుగేండ్లలో 31 ప్రమాదాలు ..
రోడ్లపై ధాన్యం రాశులు పోయడంతో ఈ నాలుగేండ్లలో 31 ప్రమాదాలు జరిగాయి. ఎంతో మందిపై కేసులు కూడా నమోదు చేశారు. రోడ్లపై ధాన్యం రాశులను పోయకుండా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్‌ సేఫ్టీ సమావేశాలను ఇటీవల పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ నేతృత్వంలో నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లో రోడ్‌ సేఫ్టీ సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇక నుంచి రోడ్లపైన ధాన్యం రాసులు పోసే వారి పైన కేసులు నమోదు చేయనున్నారు.

ఉపాధి హామీ పథకంలో కల్లాల ఏర్పాటు ..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులు వారి వ్యవసాయ పొలాల వద్ద కల్లాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి వ్యవసాయ బావి వద్ద కల్లాలు ఏర్పాటు చేసుకుంటే రోడ్లపై ధాన్యం పోసే అవసరం ఉండదు. తద్వారా ప్రమాదాలను కూడా నివారించవచ్చని ప్రభుత్వం ఆలోచన చేసింది. తన వ్యవసాయ పొలం వద్ద కల్లాలు నిర్మించుకోవడానికి ఒక్కో దానికి సుమారుగా రూ.48 వేల నుంచి 52 వేల వరకు ఉపాధి హామీ పథకంలో అందిస్తారు. పొడవు వెడల్పు 11 మీటర్ల వ్యాసార్థంతో ఈ కల్లాలు నిర్మించుకోవచ్చు. జిల్లాలో ఇప్పటికే ఆయా మండలాల నుంచి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 320 మంది రైతులకు కల్లాలు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పటికే 39 కల్లాలు పూర్తి చేశారు.

గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు ..
రోడ్లపై ధాన్యం రాశులు పోయకుండా రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. రోడ్లపై ధాన్యం పోయడం వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు రైతులు యాసంగి సాగులో చేపట్టాల్సిన అంశాలను వివరిస్తారు. ఇందుకోసం ఆయా మండలాల ఏఈవోల నేతృత్వంలో గ్రామ సదస్సుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...