పండుగ పూట విషాదం..


Wed,November 13, 2019 01:47 AM

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ : కోహెడ మండలంలో కార్తిక పౌర్ణమి రోజున విషాదం నెలకొంది. ఆనందోత్సాహాల మధ్య కార్తిక పౌర్ణమి వేడుకలు జరుపుకోవాలని అన్ని ఏర్పాటు చేసుకున్న మూడు కుటుంబాలకు పండుగ విషాదాన్ని మిగిల్చింది. కార్తిక పౌర్ణమి పుణ్యస్నానం నదిలో చేయాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి వాగులోకి వెళ్లిన ముగ్గురు యువకులు ఇసుక గుంతలో పడి మృత్యువాతపడ్డారు. కోహెడ మండలం వరికోలు గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగులో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డ సంఘటన కోహెడ మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోనూ సంచలన సృష్టించింది. వరికోలుకు చెందిన పెందోట వరప్రసాద్‌(21), కంటె నిఖిల్‌(18), కూన ప్రశాంత్‌(21) అనే ముగ్గురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా గ్రామ శివారులోని మోయెతుమ్మేద నది(వాగు)లో స్నానాలు చేసొద్దామని ముగ్గురు మృతులతో పాటు శ్యామకూర అజయ్‌, శ్యామకూర రామకృష్ణ, దూడం రంజిత్‌, శనిగరం పవన్‌కల్యాణ్‌ వెళ్లారు. స్నానాలకు వెళ్లిన వారిలో రామకృష్ణకు తప్ప ఈత ఎవరికీ రాదు. వాగులో స్నానాలు చేస్తూ చేస్తూ కొంత దూరం వెళ్లగా అక్కడ లోతైన ప్రదేశం రావడంతో ఒకరి తరువాత ఒకరు అందులో వరప్రసాద్‌, నిఖిల్‌, ప్రశాంత్‌తో పాటు అజయ్‌ కూడా పడిపోయారు. ఈత వచ్చిన రామకృష్ణ మునిగిపోతున్న అజయ్‌ని మొదట బయటకు లాగాడు. అనంతరం మిగతా ముగ్గురిని బయటకు తీసే ప్రయత్నం చేసేలోపే వారు కనిపించకుండా పోయారు. పైన ఉన్నవారు కేకలు వేయడంతో వాగు చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి చూడగా అప్పటికే ముగ్గురు యువకులు నీటిలో మునిగిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌ కడుపులోంచి నీళ్లు బయటకు తీసి వెంటనే కరీంనగర్‌ దవాఖానకి తరలించారు. గ్రామస్తుల సహకారంతో నీటిలో మునిగిపోయిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.

మృతులంతా కుటుంబాలకు ఏకైక కుమారులు..
వరికోలు గ్రామంలో ఒకేసారి ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో మృతుల కుటుంబాలతో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన వద్దకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వాగు వద్దకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి కంటతడి పెట్టారు. మృత్యువాత పడిన మూడు కుటుంబాల్లోనూ వీరు ఏకైక కుమారులే కావడం బాధాకరం. పెందోట వరప్రసాద్‌ ఒక్కగానొక్క కుమారుడు కావడం, కనీసం కూతుళ్లు కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు దేవేంద్రచారి, దేవేంద్ర దంపతులకు దుఃఖానికి అంతులేకుండాపోయింది. కంటె శంకర్‌-కళ కుమారుడు నిఖిల్‌ కూడా ఏకైక కుమారుడే. ఒక చెల్లె ఉన్నప్పటికీ ఆమె వికలాంగురాలు. అలాగే కూన ప్రశాంత్‌కు ఒక సోదరి మాత్రం ఉంది. ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్‌-లచ్చవ్వ దంపతుల రోదనలు మిన్నంటాయి. వరప్రసాద్‌ ప్రస్తుతం కరీంనగర్‌లోని జ్యోతిష్మతి కాలేజ్‌లో బీఫార్మసీ చేస్తున్నాడు. కంటె నిఖిల్‌ కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. కూన ప్రశాంత్‌ కరీంనగర్‌లోని అరోరా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. చేతికొచ్చిన కొడుకులు అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం :ఎమ్మెల్యే
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృత్యువాత పడడం బాధాకరమైన సంఘటన అని, మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. సంఘటన విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన వరికోలు గ్రామానికి వచ్చారు. సంఘటన జ రిగిన ప్రాంతానికి వచ్చి మృతదేహాలను సందర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. కొడుకులను కోల్పోయిన మూడు కుటుంబాల వారు దిక్కులేని వారయ్యారని, వీరికి ఏదో వి ధంగా ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. వాగులో నుంచి అక్రమ ఇసుక రవాణా జరుకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, మార్కెట్‌ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు, వైస్‌ ఎంపీపీ తడ్కల రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్‌, సర్పంచ్‌ చంద్రకళ, ఎంపీటీసీ జయరాజు తదితరులు ఉన్నారు. కాగా హుస్నాబాద్‌ ఆర్డీవో అనంతరెడ్డి, సిద్దిపేట డీసీపీ నర్సింహారెడ్డి, హుస్నాబాద్‌ ఏసీపీ ఎస్‌ మహేందర్‌, సీఐ శ్రీనివాస్‌ తమ సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌ దవాఖానకు తరలించారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...