రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నగదు రహిత లావాదేవీలు


Wed,November 6, 2019 11:09 PM

గజ్వేల్‌రూరల్: రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నగదు రహిత లావాదేవీలను ప్రారంభించినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగ దారులకు మెరుగైన సేవలందించడంతో పాటు అవీనీతికి తావులేకుండా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో పెండింగ్ ఉన్న దస్తావేజులను వెంట వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ ఉన్న దస్తావేజుల వివరాలను ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దస్తావేజులను పూర్తి చేయడం ద్వారా రాష్ర్టానికి ఆదాయాన్ని సమకూర్చవచ్చన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి రోజు రికార్డులను వెంటవెంటనే ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. టీ చిట్టీ యాప్ ద్వారా గుర్తింపు పొందిన చిట్ ఫండ్స్‌ల వివరాలను తెలుసుకుని ఆయా చిట్‌ఫండ్‌లలోనే చిట్టీలను వేసుకోవాలని, ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులను అప్పగించొద్దని ప్రజలను ఈ సందర్భంగా హెచ్చరించారు. బోగస్ చిట్‌ఫండ్‌లో చిట్టీలు వేసి మోసపోతే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి చొరవతో సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంతభవనం సదుపాయం కలిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యాలయ పరిసరాలను పచ్చని మొక్కలతో అందంగా తీర్చిదిద్దారని సిబ్బందిని మెచ్చుకున్నారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో డీఐజీ మొక్కను నాటారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్‌లు రమేశ్‌రెడ్డి, ప్రకాశ్, స్థానిక సబ్ రిజిస్ట్రార్ రాజేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...