గృహ ప్రవేశాలకు వేళాయే


Wed,November 6, 2019 01:18 AM

- రాష్ట్రంలో తొలి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ
- ‘అనంతగిరి’ ముంపు బాధితులకు లింగారెడ్డిపల్లిలో పక్కా ఇండ్లు
- సకల సౌకర్యాలతో 130 ఇండ్ల నిర్మాణం
- నేడు మంత్రి హరీశ్‌రావుచే సామూహిక గృహ ప్రవేశాలు
- ఇండ్లు చూసి మురిసిపోతున్న కొచ్చగుట్టపల్లి గ్రామస్తులు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అనంతగిరి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతున్నది. దీంతో కొచ్చగుట్టపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణం కోసం జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని లింగారెడ్డిపల్లి వద్ద అన్ని హంగులతో సుమారు 130 గృహాలను నిర్మించారు. హైదరాబాద్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని అన్ని సౌకర్యాలతో నిర్మించారు. సామూహిక గృహ ప్రవేశాల ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మతో పాటు సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, చిన్నకోడూరు వైస్‌ ఎంపీపీ కీసరి పాపయ్య, పలువురు ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

కొచ్చగుట్టపల్లి గ్రామస్తుల్లో సంబురం
తమ గ్రామం ముంపునకు గురవుతుందనే బాధలో ఉన్నా కొచ్చగుట్టపల్లి గ్రామస్తులకు సకల హంగులతో అన్ని సౌకర్యాలతో సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో ఇండ్లను కేటాయించడం పట్ల గ్రామస్తులు సంబురం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సామూహిక గృహ ప్రవేశాలు జరగనుండడంతో వారికి కేటాయించిన ఇండ్ల వద్దకు వచ్చి ఇండ్లను అలంకరించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సౌకర్యాలతో ఇండ్లను కట్టించడం పట్ల గ్రామస్తుల్లో సంబురం నెలకొంది.

ఇండ్లు మంచిగున్నయి..
ప్రభుత్వం కట్టించి ఇచ్చిన ఇండ్లు మంచిగున్నయి. నాతో పాటు నా కుమారుడికి ఇల్లు ఇచ్చారు. అన్ని సౌకర్యాలతో ఇండ్లు కట్టించారు. ఊరందరికీ ఒకే దగ్గర ఇండ్లు రావడంతో వల్ల మేమంతా ఒక చోటే ఉండడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సార్‌కు ధన్యవాదాలు.
- గడ్డం లక్ష్మీమల్లయ్య (కొచ్చగుట్టపల్లి)

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సార్లకు ధన్యవాదాలు..
ముంపు బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మంచి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సిద్దిపేట పట్టణ పరిధిలో నిర్మించి ఇవ్వడం పట్ల మేం సంతోషంగా ఉన్నాం. ఇంత మంచి కాలనీని నిర్మించి ఇచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సార్లకు ధన్యవాదాలు.
- చింతలపల్లి కార్తిక్‌ (కొచ్చగుట్టపల్లి)

మంచి ఇండ్లు కట్టించారు..
మాకున్న నాలుగు ఎకరాల భూమి, ఇల్లు ప్రాజెక్టులో మునిగింది. మంత్రి హరీశ్‌రావు సార్‌ భూములు ఇచ్చిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం మంచి పరిహారంతో పాటు సిద్దిపేట శివారులో ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు 107వ నంబరు ఇల్లు వచ్చింది. మంచిగా కట్టిన్రు. నల్లా, కరెంట్‌ మీటరు పెట్టిండ్రు.
- బొడ్డు లక్ష్మి (కొచ్చగుట్టపల్లి)

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...