మున్సి‘పోల్స్‌'కు గ్రీన్‌ సిగ్నల్‌


Wed,October 23, 2019 01:05 AM

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై దాఖలైన అన్ని రకాల పిటిషన్లను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో జిల్లాలోని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, నూతనంగా ఏర్పాటు చేసిన చేర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత కోర్టు తీర్పు ప్రకారం అన్ని రకాల కేసులు కోర్టు కొట్టి వేయడంతో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. కాగా గజ్వేల్‌, దుబ్బాక మున్సిపాలిటీలపై ప్రత్యేక కేసులు ఉండడంతో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెలలో జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీ మినహా అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వార్డుల విభజన, స్ట్రాంగ్‌ రూంల ఏర్పాటు తదితర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. సిద్దిపేట మున్సిపాలిటీకి ఇంకా గడువు ఉండడంతో వీటితో పాటు ఎన్నికలు జరగడం లేదు. హైకోర్టు మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

మున్సిపల్‌ ఎన్నికల కోసం హైకోర్టు పచ్చజెండా ఊపడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాకతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఉండడంతో మిగతా 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల కోసం అధికార యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది. ఇంతకు ముందే జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే ఈ మున్సిపాలిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన పూర్తి చేశారు. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు...
దుబ్బాక మున్సిపాలిటీలో మొత్తం 20071 మంది ఓటర్లు ఉండగా వీరిలో 10286 మంది మహిళా ఓటర్లు, 9785 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని మొత్తం 20 వార్డులుగా విభజించారు. హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం 17073 మంది ఓటర్లు ఉండగా వీరిలో 8665 మంది మహిళా ఓటర్లు, 8407 మంది పురుష ఓటర్లు ఉండగా మొత్తం 20 వార్డులు ఉన్నాయి. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, మున్సిపాలిటీలో మొత్తం 30130 మంది ఓటర్లు ఉండగా వీరిలో 15078 మంది మహిళా ఓటర్లు, 15052 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని మొత్తం 20 వార్డులుగా విభజించారు. నూతనంగా ఏర్పాటైన చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12125 మంది ఓటర్లు ఉండగా వీరిలో 6147 మంది మహిళా ఓటర్లు, 5918 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని మొత్తం 12 వార్డులుగా విభజించారు. జిల్లాలో ప్రస్తుతం 143 పోలింగ్‌ కేంద్రాలు గుర్తించగా గజ్వేల్‌లో అదనంగా మరో రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించడంతో మొత్తం జిల్లాలో 145 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో 43 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అదనంగా మరో 2 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హుస్నాబాద్‌లో 35, దుబ్బాకలో 41, చేర్యాలలో 24 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించి గుర్తించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...