లక్కెవరిదో..


Thu,October 17, 2019 11:32 PM

-నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా
- ఆశావహుల్లో ఎడతెగని ఉత్కంఠ
-డ్రా వద్ద దరఖాస్తుదారుడు ఉండాల్సిందే..
- లేకుంటే రూ.5 లక్షలు జరిమానా
-జిల్లాలో 70 దుకాణాలకు 1336 దరఖాస్తులు
-నవంబరు 1 నుంచి నూతన మద్యం పాలసీ

సిద్దిపేట టౌన్ : మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా తనకు కావాల్సిన దుకాణాన్ని చేజిక్కించుకోవాలని ఒక్కొక్క దుకాణానికి పదుల సంఖ్యలో టెండర్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా 5 ఎక్సైజ్ సర్కిల్ పరిధిలు ఉండగా 70 మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచారు. గత 2 సంవత్సరాల క్రితం జరిగిన టెండర్ల కంటే రికార్డు స్థాయిలో ఈ సారి 1336 దరఖాస్తులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెల్లువెత్తాయి. డిమాండ్ ఉన్న దుకాణాల కోసం వేళ్లపైన లెక్కించే విధంగా అనూహ్యంగా టెండర్లు వేశారు. జిల్లాలోని కొమురవెల్లి, మద్దూరు వైన్స్ షాపుల ఏర్పాటు కోసం ఏకంగా 62 చొప్పున దరఖాస్తులను సమర్పించారు.

ఆశావహుల్లో ఉత్కంఠ..
ప్రభుత్వం రూపొందించిన నూతన మద్యం పాలసీకి ఆశావహుల నుంచి మంచి స్పందన లభించింది. మద్యం వ్యాపారంలో లాభాలు గడిస్తుండడంతో ఆశావహులు పోటీ పడ్డారు. మొదటి ఐదు రోజుల దరఖాస్తుల ప్రక్రియలో ఎవరు ఉత్సాహం చూపనప్పటికీ గడువుకు చివరి రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియ భారీగా పుంజుకుంది. ఆరో రోజు 516 దరఖాస్తులు రాగా చివరి రోజు 800 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రెండు సంవత్సరాల క్రితం జరిగిన టెండర్లు వేసి మద్యం దుకాణం కోల్పోయిన వారు, కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారంలోకి దిగిన వారు, ఇది వరకు మద్యం టెండర్లు దక్కించుకొని లాభాలు గడించిన వారు ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు దరఖాస్తు ఫీజు ఉండగా ఈ సారి రూ.2 లక్షల దరఖాస్తు ఫీజును పెంచింది. అయినప్పటికీ మద్యం వ్యాపారులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పెద్ద సంఖ్యలో టెండర్లు వేశారు. దుకానాలు ఎవరికి దక్కుతాయోనని తమ అదృష్టం ఈ సారి ఎలా ఉందోనని ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పోతే రెండు లక్షలు..
మద్యం దుకాణాల ఏర్పాటు కోసం పోటాపోటీగా టెండర్లు పడ్డాయి. 2017 సంవత్సరంలో 1044 దరఖాస్తులు రాగా, ఈ సారి ఆశావహులు 1336 దరఖాస్తులు సమర్పించారు. ఈ 1336 మందిలో కేవలం 70 మందిని మాత్రమే అదృష్టం తలుపుతట్టనుంది. మద్యం దుకాణం లక్కీ డ్రాలో తగిలితే లక్కు.. కిక్కు.. రెండు సంవత్సరాలు దక్కుతుంది. మద్యం దుకాణం డ్రాలో రాకపోతే రూ.2 లక్షలు పోతాయి.

నేడు రెడ్డి సంక్షేమ భవన్‌లో లక్కీ డ్రా..
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. శుక్రవారం సిద్దిపేట రాజీవ్ రహదారి రంగధాంపల్లి సమీపంలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో మద్యం దుకాణాల ఏర్పాటుకు లక్కీ డ్రా తీయనున్నారు. ఈ కార్యక్రమం కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సమక్షంలో జరుగనుంది.

టెండర్ల దరఖాస్తు దారులంతా డ్రాకు హాజరు కావాల్సిందే..
గజ్వేల్‌రూరల్ : రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ సిద్దిపేటలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాల టెండర్ల డ్రాకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని గజ్వేల్ ఎక్సైజ్ సీఐ ప్రభావతి సూచించారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 19 దుకాణాలకు గాను 335 దరఖాస్తులు వచ్చాయన్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు డ్రా తీస్తారని అరగంట ముందుగానే దరఖాస్తు దారులంతా చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఏదైనా దుకాణం డ్రాలో తీసిన పేరు గల దరఖాస్తు దారులు డ్రాకు హాజరు కాకపోతే సదరు వ్యక్తికి దుకాణాన్ని కేటాయించబడదని హెచ్చరించారు. అంతేకాకుండా నూతన చట్టం ప్రకారం సదరు వ్యక్తికి రూ.5లక్షల జరిమానా విధిస్తారన్నారు. కావున మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తు చేసుకున్న ప్రతివ్యక్తి డ్రా సమయానికి రెడ్డి ఫంక్షన్‌హాల్‌కు చేరుకోవాలని ఎక్సైజ్ సీఐ సూచించారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...