ప్రయాణికుల సేవలో ఆర్టీసీ


Thu,October 17, 2019 12:13 AM

సిద్దిపేట టౌన్ : ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఏర్పడిన రోడ్డు రవాణా సంస్థ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. 12 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. సిద్దిపేట జిల్లాలో 4 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. అన్ని రూట్లలో బస్సులు తిరిగేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సఫలీకృతమయ్యారు. కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్ డెవిస్, జిల్లా రవాణా శాఖ అధికారి రామేశ్వర్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తూ ప్రజలు, ప్రయాణికులను అనుకున్న సమయానికే గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక డిపోలున్నాయి. బుధవారం ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె ప్రైవేటు బస్సులు కలుపుకొని 358 వాహనాలు ఆయా రూట్లలో తిరిగాయి. సిద్దిపేట డిపో పరిధిలో 59 ఆర్టీసీ బస్సులు, దుబ్బాకలో 28, హుస్నాబాద్‌లో 34, గజ్వేల్‌లో 44 మొత్తం 165 ఆర్టీసీ బస్సులు జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులను తీసుకెళ్లాయి. అదే విధంగా హైర్‌విత్ 76, సీసీ బస్సులు 24, ఈఐబీఎస్ 13, మ్యాక్స్ క్యాబ్ 80 ఇలా అద్దె ప్రైవేటు వాహనాలు 195 ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు యథావిధిగా చేరవేశాయి. ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ల వద్ద ఆయా సర్కిళ్ల పరిధిలోని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో బస్సులు నడిచేలా అధికారులు పర్యవేక్షణ జరిపారు.

బస్సు డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
ఆర్టీసీ బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు కొంత మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారనే సమాచారంతో సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ సైదులు, సిబ్బందితో వెళ్లి డ్రైవర్లకు బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించి, ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles