సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టాళ్లు


Tue,October 15, 2019 11:54 PM

-సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక యాప్
-సిద్దిపేట రైతుబజారులో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు
-పాడి ఆవుల పంపిణీ సంతోషంగా ఉంది
-ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
-202 మంది రైతులకు పాడి పశువుల అందజేత
-ఆవులకు పూజలు చేసిన జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని, సేంద్రియ సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు పాడి ఆవులను అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏ పుణ్య కార్యం చేసిన గోపూజ ముఖ్యమని, ఇంట్లోని చంటి పిల్లలను ఎలా చూసుకుంటారో, ఆవులను అలానే పోషించాలన్నారు. మంగళవారం సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, సీపీ జోయల్ డెవిస్, డీఆర్‌వో చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, జిల్లా వెటర్నరీ అధికారి రామ్‌జీతో కలిసి 202మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేశారు. ఆవులను తీసుకరావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి చేనేత వస్ర్తాలతో సన్మానం చేశారు. సిద్దిపేట పశువుల సంతలో ఉన్న ఆవులకు గోపూజ చేశారు. ఆవులను డ్రా సిస్టం పద్ధతిలో టోకెన్లు తీసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆవుల పంపిణీ తనకెంతో సంతోషాన్నిచిందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లోని 267మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని, వీరిలో ఇప్పటికే 112 మందికి ఆవులను అందజేశామని, మరో 151మంది రైతులకు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం గుడుంబా తయారీ వదులుకున్న 52మంది ఎస్టీలకు ఆవులిచ్చామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా 202మంది రైతులు ఆవులను అందజేశామని, ఆవులను జాగ్రత్తగా చూసుకోవాలని, అమ్మినా, నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేంద్రియ పంటలను అమ్మేందుకు ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.

రైతుబజారులోను సేంద్రియ ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సేంద్రియ వ్యవసాయ రైతులందరినీ కలిపి ఒక గ్రూపు క్రియెట్ చేసి, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి, సిద్దిపేట సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటకలోని బెల్గాం నుంచి ఆవులను తీసుకరావడానికి నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సోంరెడ్డి, పశు వైద్యాధికారి రామ్‌జీ, బాలసుందరం కృషి చేశారని అభినందించారు. ఆవులను కొనుగోలు చేయడానికి మిలటరీ వారు కలెక్టర్ లెటరు అడిగితే, గంటలోపు వాట్సాప్ ద్వారా లెటర్ పంపి, అక్కడి అధికారులతో మానిటరింగ్ చేసిన కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని, ఆవులను సురక్షితంగా తెచ్చేందుకు ప్రత్యేక కృషి చేసిన సీపీ జోయల్ డెవిస్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఏడు గ్రామాల్లోని రైతులకు పంపిణీ చేసిన ఆవులను, పది రోజుల పాటు పర్యవేక్షణ చేసేందుకు పది మంది వెటర్నరీ సిబ్బంది నిత్యం కృషి చేయాలని సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మంచి ఆరోగ్యం ఉంటుందని, రైతులకు పాడి ఆవులను అందించడం మంచి కార్యక్రమన్నారు. కార్యక్రమంలో చిన్నకోడూరు, నారాయణరావుపేట ఎంపీపీలు మాణిక్యరెడ్డి, ఒగ్గు బాలకృష్ణ యాదవ్, జడ్పీటీసీలు తడిసిన ఉమావెంకట్‌రెడ్డి, కోటగిరి శ్రీహరిగౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, నాయకుడు దువ్వల మల్లయ్య, బాల వికాస ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...