అభివృద్ధి మా వల్లే.. ఆదరణ మా వైపే..


Sun,October 13, 2019 12:14 AM

గతంలో హుజూర్‌నగర్‌లో సరైన ప్రత్యర్థి లేకపోవడడం, ఎన్నికల సమయంలో కొత్త వారు రావడం, వెంటనే వెళ్లి పోవడమే ఉత్తమ్‌ విజయానికి కారణం. అయితే, సైదిరెడ్డి ఓడినప్పటికీ పది నెలలుగా నియోజకవర్గ ప్రజలు సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ కేడర్‌ను బలోపేతం చేస్తూ నేడు మళ్లీ బరిలో నిలిచారు. ఈ సారి భారీ విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

2018అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ప్రచారం చేశాడు. ట్రక్కు గుర్తు వల్ల టెక్నికల్‌గా గెలిచాడు తప్ప నేటి ఉప ఎన్నికల్లో ఆ వాతావరణం లేదు. తిరిగి పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో తాను కేంద్ర మంత్రిని అవుతానని నమ్మబలికి విజయం సాధించాడు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రజను మళ్లీ మోసగించడానికి ఏమీ లేక గందరగోళంలో పడి ఏవేవో మాట్లాడుతున్నాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడాన్ని నియోజకవర్గ ప్రజలు పెద్ద జోక్‌గా చెప్పుకుంటున్నారు. దీనిని ఉత్తమ్‌ తాను అభివృద్ధి చేయలేదని ఒప్పుకుంటున్నాడని జనం అర్థం చేసుకుంటున్నారు. ఇక హుజూర్‌నగర్‌లో బీజేపీ కాంగ్రెస్‌కు సహకారం అందించడాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. రెగ్యులర్‌గా ఉత్తమ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో మాట్లాడుతున్నాడు. ఉత్తమ్‌ ఎన్నికల కమిషన్‌కు చేసే ప్రతి ఫిర్యాదును లక్ష్మణ్‌కు కూడా పంపిస్తున్నారు. దీంట్లో మర్మం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి.

అభివృద్ధి, సంక్షేమాలతో కాంగ్రెస్‌కు బ్రేకులు...
హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధానంగా రైతులు, వ్యవసాయాధారిత గ్రామీణ వృత్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడం... ముఖ్యమంత్రి ఆరేండ్లుగా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం ఆయా వర్గాలను సంతోషపెడుతోంది. ప్రధానంగా 24గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా జరుగుతున్న విషయాన్ని రైతులు గుర్తించి నేడు చర్చించుకుంటూ గత పాలకుల హయాంలో దారుణ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు. నాడు పింఛన్‌దారులకు రూ.200, 500 చొప్పున ఇవ్వగా నేడు 2016, 3016లకు పెంచడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలో యాదవులు, గొర్రెలకాపరులు, మత్స్య కార్మికుల మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉందనడంలో అతిశయోక్తి లేదు.

ఉత్తమ్‌ సెల్ఫ్‌గోల్‌ చేసుకుంటుండు...
ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని భావించిన ఉత్తమ్‌.. ఆ గందరగోళంలో కొన్ని నిర్ణయాలు, ప్రకటనలు చేస్తూ ఫెయిల్‌ అవుతున్నాడు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిది నాన్‌లోకల్‌ అనడమే ఇందుకు ఉదాహరణ. సైదిరెడ్డిది ఏ ఊరు అని ఎవరిని అడిగినా గుండ్లపల్లి అని, ఆయన తండ్రి ఓ పార్టీకి మండలాధ్యక్షుడిగా పని చేశారని, గ్రామ సర్పంచ్‌ అయ్యారనే విషయం ప్రజలకు తెలుసు. అలాంటప్పుడు సైదిరెడ్డి స్థానికేతరుడు ఎలా అవుతాడు.? అసలు ఉత్తమ్‌, పద్మావతిది ఏ ఊరు అని ప్రజలను ప్రశ్నిస్తే ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ప్రజ ల్ని మోసం చేయడానికి ఉత్తమ్‌ వద్ద ఏమి ఆయుధాలు లేక నేడు పలు వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజ ల్లో అభాసుపాలవుతున్నాడు.

గెలువబోతున్నాడు...
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్థానికుడే. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఓటమి పాలైనా నిత్యం కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. 10నెలలు గా ఒక్కో గ్రామంలో ఐదు నుంచి 10సార్లు పర్యటించాడు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకున్నాం. వందకు పైగా సర్పంచ్‌లు గెలువగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మావే ఎక్కువ. బూత్‌ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని వందశాతం పూర్తి చేశాడు. సమస్యల పరిష్కారానికి నాతో పాటు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరిస్తున్నాడనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మరో అవకాశం వచ్చింది, సైదిరెడ్డిని గెలిపించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే చర్చ జరుగుతుంది.

ఏమీ చేయని ఉత్తముడు...
ఉత్తమ్‌ గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి ఏ పని చేయకపోగా ఆరేండ్లలో ఏ ఒక్కరోజు నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో చర్చించలేదు. సీఎం కేసీఆర్‌కు గానీ, జిల్లా మంత్రిగా నా దృష్టికి తేలేదు. ప్రజలంటే అభిమానం, గౌరవం, ప్రేమ లేనేలేదు. లెక్కలేని తనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గానీ, సూర్యాపేట జిల్లాలో గానీ, జడ్పీ సమావేశాలకు సైతం హాజరుకాలేదు. ఇక ప్రజా సమస్యలపై ఒక్క సమీక్షకు హాజరు కాలేదు. నేడు ఇవన్నీ ప్రజలు చర్చిస్తున్నారు.

అభివృద్ధి బాధ్యత మాది..
హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలు సైదిరెడ్డిని గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకోవాలి. హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల రెండు మున్సిపాలిటీలతోపాటు చాలా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రత, పచ్చదనం, రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్ల సమస్య పరిష్కరిస్తాం. ప్రధానంగా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాల్సి ఉంది. కొన్ని ఎత్తిపోతల పథకాల అవసరం ఉంది. సైదిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం బాధ్యత మాది.

సాగర్‌ జలాలపై రైతుల చర్చే గెలిపిస్తుంది...
గత, ప్రస్తుత ప్రభుత్వాల పాలనలో నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ నీటి విడుదలపై రైతాంగం చేస్తున్న చర్చలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఖరారు చేయనున్నాయి. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మొత్తం నాగార్జునసాగర్‌ ఆయకట్టే. గతంలో సాగర్‌లో ఏ మాత్రం నీళ్లున్నా ఎడమ కాల్వను ఎండబెట్టి కుడి కాల్వ డెల్టాకు తీసుకుపోయారు. చంద్రబాబు హయాంలో వరుసగా ఏడేళ్లు కరువొచ్చినా కుడి కాల్వకు నీటిని వదిలి ఎడమ కాల్వను పట్టించుకోలేదు. నాడు హుజూర్‌నగర్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఎడమ కాల్వ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉండి ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడంతో చేతికి వచ్చే పంట ఎండిపోయింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెడ్‌ స్టోరేజీలో నీళ్లను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల పంటను కాపాడాం. రైతులు ఆ మార్పును స్పష్టంగా గమనిస్తున్నారు. ఇది ప్రధానంగా సైదిరెడ్డి గెలుపునకు దోహదపడనుంది.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...