సమస్యల అంచున..పాత వంతెన


Fri,October 11, 2019 02:14 AM

తొగుట : మండలంలోని వాగ్గడ్డ వద్ద గల పాత బ్రిడ్జి మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కొద్దిరోజుల క్రితం విస్తారంగా వర్షాలు కురియడంతో కూడవెల్లి వాగు నిండిపోయింది. చెక్‌డ్యాంలు నిండిపోవడంతో పాత బ్రిడ్జి మీదుగా నీరు రెండు, మూడు ఫీట్ల ఎత్తులో నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాస్తవానికి గత ఎన్నో ఏండ్లుగా వెంకట్రావుపేట మీదుగా కామారెడ్డి, చేగుంట, దుబ్బాక తదితర ప్రాంతాల నుంచి గజ్వేల్, సిద్దిపేటకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే గతంలో పాత బ్రిడ్జి మీదుగా కాకుండా పక్కన కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. పాత బ్రిడ్జితో పాటు చందాపూర్ క్రాసింగ్ వద్ద కూడా పాత బ్రిడ్జి లోతుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పాత బ్రిడ్జి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గతంలో సమస్య లేకున్నా కోటిలింగాలగుడి వద్ద గల చెక్‌డ్యాం ఎత్తు లేపడంతో పాత బ్రిడ్జి మీదికి నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో చందాపూర్ మీదుగా కొత్త బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నా అర కిలోమీటర్ చుట్టూరా తిరగాల్సి రావడంతో నీళ్ల నుంచే వాహనాల రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వాగుల్లో నీళ్లు వుండటంతో -ప్రవాహం వచ్చినా ప్రజలు గుర్తించలేని పరిస్థితి ఎదురవుతున్నది. తద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడింది. పాత బ్రిడ్జి మీదుగా నేడు రాకపోకలు సాగించడంతో వాహనాల ఇంజిన్‌లలోకి నీరు వెల్లడంతో పలువురి వాహనాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్న తొగుట మండలం లింగంపేట-అల్వాల వద్ద, మిరుదొడ్డి వద్ద కూడవెల్లి వాగుమీద పాత బ్రిడ్జీల మీదనే కొత్త బ్రిడ్జీలు నిర్మించడానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఒక్కో దానికి రూ.4 కోట్ల చొప్పన నిధులు మంజూరు చేయించగా.. లింగంపేట బ్రిడ్జి పూర్తి కావడంతో అందుబాటులోకి రాగా, అల్వాల బ్రిడ్జి కోర్టు కేసుల మూలంగా పనులు నిలిచిపోయాయి. సమస్యాత్మకంగా మారిన వెంకట్రావుపేట పాత బ్రిడ్జి మీద కొత్త బ్రిడ్జి నిర్మించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...