ఆరోగ్య తెలంగాణే లక్ష్యం


Fri,October 4, 2019 12:02 AM

ములుగు : అనారోగ్యంలేని ఆరోగ్యవంతమైన రాష్ర్టాన్ని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండల పరిధిలోని లక్ష్మక్కపల్లిలో ఉన్న ఆర్వీఎం దవాఖాన, మెడికల్ కళాశాలలో అత్యాధునిక ల్యాబోరేటరీని గురువారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో అత్యున్నత ప్రమాణాలు సాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వైద్యం ప్రజలకు అందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో కేజీ టూ పీజీ విద్య ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. అదే లక్ష్యంతో గజ్వేల్ ప్రాంతంలో ఆర్వీఎం మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలకు ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్ గొప్ప వైద్యసేవలను అందించాలని ఆకాంక్షించారు. అధునాతన వైద్య సదుపాయాలను అందించి నిమ్స్, గాంధీ తరహాలో పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు. ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు.. పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రాక్టికల్‌గా రోగుల బాధను అర్థం చేసుకొని వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు పడే కష్టం.. మిగతా రంగాల్లో ఉన్న విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటుందన్నారు.

సంవత్సరాలు తరబడి వైద్యవిద్యను అభ్యసించి రోగులకు సేవచేసే గొప్ప అవకాశం వైద్యులకు మాత్రమే ఉందని అన్నారు. డబ్బుతో వెలకట్టలేనిది ఒక ప్రాణం మాత్రమేనని.. అలాంటి ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్లు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. రోగాలతో బాధపడుతూ దవాఖానాలకు వచ్చే పేదలకు అర్వీఎం ఇన్‌స్టిట్యూట్ ఉచితం గా వైద్యసేవలు అందించి ఆదుకోవాలని మంత్రి రాజేందర్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్పే మాటలను గుర్తు చేస్తూ బంగారు తెలంగాణ సాధించాలంటే అందుకు ఆరోగ్యవంతమైన తెలంగాణ అవసరమన్నారు. ఇందులో భాగంగానే హరితహారం ద్వారా చక్కని పర్యావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోగాల నియంత్రణకు చెట్ల పెంపకం సరైన మార్గమని.. హరితహారంలో కోట్లాది మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి ఆరోగ్యతెలంగాణకు బాట లు వేసేందుకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం కళాశాల టాపర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్వీఎం దవాఖాన, మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ యాకయ్య, డైరెక్టర్లు కాలి ప్రసాద్, రాజేందర్, నరేశ్, గోపీకృష్ణ, సీఈవో శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహ్మద్ జహంగీర్, నాయకులు జుబేర్‌పాషా, పెద్దబాల్ అంజన్‌గౌడ్, తహసీల్దార్ విజయ్‌కుమార్, సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ హరిబాబు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...