అమ్మోనియం నైట్రేట్ అక్రమ రవాణా కేసులో ఇద్దరి అరెస్టు


Wed,October 2, 2019 10:45 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : పేలుడు పదార్థాల్లో వినియోగించే అమ్మోనియం నైట్రేట్ బస్తాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిద్దిపేట అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(లా అండ్ ఆర్డర్) నర్సింహారెడ్డి తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. బుధవారం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఏసీపీ మహేందర్‌తో కలిసి మాట్లాడారు. డీసీపీ తెలిపిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. అక్కన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంతకపేట గ్రామ శివారులోని కట్కూరు క్రాసింగ్ వద్ద ప్రొబేషనరీ ఎస్‌ఐ సంపత్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్‌జే 21జీసీ 2253 నంబరు గల లారీలో అనుమానాస్పద సరుకు ఉన్నట్లు గమనించారు. వేబిల్లును చూడగా అందులో ఆప్టిమాక్స్ బ్యాగులు తరలించేందుకు అనుమతి ఉంది. కానీ లారీలో చెక్‌చేయగా అందులోని బస్తాలపై అమ్మోనియం నైట్రేట్ అని రాసి ఉండటంతో అనుమానం వచ్చి లారీ డ్రైవర్ కమ్ ఓనర్ రాజస్తాన్‌కు చెందిన భన్వార్‌సింగ్‌ను ప్రశ్నించారు. రాజస్థాన్‌కు చెందిన సోహాన్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు హన్మకొండ నివాసి అయిన ఎక్స్‌ఫ్లోజివ్ డీలర్ పున్‌రెడ్డి కృష్ణారెడ్డి వద్ద నుంచి అమ్మోనియం నైట్రేట్ బస్తాలను తెచ్చి రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో గల రాకేశ్ వద్ద అన్‌లోడ్ చేసేందుకు ఒప్పుకున్నట్లు డ్రైవర్ చెప్పాడు.

వరంగల్ జిల్లా నర్మెట్ట మండలంలోని అమ్మాపూర్‌లో గల కృష్ణారెడ్డికి చెందిన గోదాం నుంచి అక్కడి సూపర్‌వైజర్ రామ్‌కిషోర్ ద్వారా 360 అమ్మోనియం బస్తాలను లోడ్ చేసుకొని వస్తున్నట్లు వివరించాడు. అమ్మోనియం తరలింపుపై పూర్తి విచారణ చేసిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారని నిర్ధారించుకొని ఎక్స్‌ప్లోజివ్ డీలర్ అయిన కృష్ణారెడ్డి, లారీ డ్రైవర్ భన్వార్‌సింగ్, రాకేశ్, రామ్‌కిషోర్, సోహాన్‌లపై కేసు నమోదు చేశారు. లారీలో తరలిస్తున్న 360 అమ్మోనియం బస్తాల విలువ సుమారు రూ.8లక్షల వరకు ఉంటుందని, కృష్ణారెడ్డి, భన్వార్ సింగ్‌లను అరెస్టు చేసి మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ వివరించారు. పేలుడు పదార్థాలను అనుమతి లేకుండా, అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన పోలీసు సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ పాపయ్యనాయక్, ప్రొబేషనరీ ఎస్‌ఐ సంపత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...