పచ్చటి, పరిశుభ్ర పల్లెలుగా మార్చుకుందాం


Fri,September 20, 2019 11:18 PM

గజ్వేల్ రూరల్: పల్లె ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతను వందశాతం పూర్తి చేసి, పరిశుభ్ర, పచ్చటి పల్లెలుగా మళ్లీ తయారు చేసుకుందామని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీచైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, మహిళా సంఘాలకు 30రోజుల కార్యాచరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి కలెక్టర్, జడ్పీ అధ్యక్షురాలు ముఖ్యఅతిథులుగా హాజరై, మాట్లాడారు. దేశంలోనే పెను మార్పులను తీసుకొచ్చేలా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని సీఎం కేసీఆర్ రూపొందించారన్నారు. పల్లె ప్రణాళికకు ప్రభుత్వం రూ.339కోట్లను వెచ్చిస్తున్నదన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 499జీపీలకు 4240 పనులు మంజూరు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. 40ఏండ్లుగా పాత చట్టాలతో గ్రామాలు కొనసాగడంతో పెద్దగా మార్పులు రాలేదని, నూతన చట్టంతో గ్రామాలన్నీ విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యాచరణ ముఖ్యంగా పరిశుభ్రత, హరితహారం, వార్షిక, పంచవర్ష ప్రణాళిక అనే అంశాలపైనే కొనసాగుతున్నదన్నారు. పనుల నిర్వహణకు నిధులు సంపూర్ణంగా ఉన్నాయని, ఎక్కువ పనులను ఉపాధి హామీ ద్వారా నిర్వహిస్తే పంచాయతీ నిధులను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకోవచ్చన్నారు.

కార్యాచరణ అనంతరం అన్ని గ్రామాలను సర్‌ప్రైజ్ విజిట్ చేస్తామని, ఆ సందర్భంలో గ్రామాలు పరిశుభ్రంగా లేకపోతే మరో 10రోజుల గడువులో పూర్తిస్థాయిలో చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి మాత్రం లేదన్నారు. బాగా పరిశుభ్రంగా మారిన గ్రామాలను మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసి, జిల్లా అవార్డులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిపేలా సర్పంచ్‌లు, అధికారులు ప్రజలతో కలిసి పనిచేయాలన్నారు. గ్రామాల్లో రోజుకు 400మంది పనిచేస్తే 10రోజుల్లో పరిశుభ్ర గ్రామాలు తయారవుతాయన్నారు. అనంతరం ఆయా మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కార్యాచరణ గురించి తమ అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, వర్గల్, ములుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, గజ్వేల్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, మహిళా సంఘాల అధ్యక్షులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...