పంటపొలాల్లో సమస్యగా మారిన కలుపు


Tue,September 17, 2019 11:56 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: పంటల సాగులో ప్రధానమైన పని కలుపు నివారణ. వారం రోజులు రైతులు పొలం వైపు చూడక పోతే సాగు చేసిన పైరును కలుపు మింగేసి తీరని నష్టాన్ని మిగులుస్తుంది. ప్రకృతి పరిస్థితులు, భూరకాలు, ఇంతకు మందు సాగు చేసిన పంటలను బట్టి కలుపు సమస్య ఉంటుంది. సాగు ఖర్చులో అధిక భాగం కలుపు కోసం రైతు వెచ్చించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలో దొరికినా కలుపు నివారణ మాత్రం రైతుకు సమస్యగా మారింది. జిల్లాలో4లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు జిల్లా వ్యవసాయ అధికారులు చెప్తుండగా 2 లక్షల ఎకరాల్లో పత్తి, 1లక్ష 70వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా ఈ రెండు పంటలు అత్యధిక విస్తీర్ణంలో కలుపుతో పేరుకు పొయినట్లు రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో కలుపు నివారణ పనులపై రైతుకు భారం పెరుగుతుంది. రెండు సార్లు మొక్కల మొదళ్ల వద్ద ఉన్న కలుపు తీతకు 4వేలరూపాయల ఖర్చు కలిసి మొత్తం రూ12వేలకు పైగా అవుతుంది. కూలీలు సమయానికి రాక కూడా అనేక ఎకరాల్లో సాగు రైతులు కలుపు సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఆధునిక యంత్రాలే ప్రత్యామ్నాయం...
కలుపు నివారణకు ఆధునిక యంత్రాలే ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. పొలంలో రైతులే పలు విధాల కలుపుతీత ప్రయోగాలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న యంత్రాలను వివిధ రకాలుగా మార్చడమే కాకుండా కొత్తగా పనిముట్ల తయారీకి ప్రయత్నిస్తున్నాడు. పశువుల ద్వారా ఎకరం కలుపు తీతకు 9 నుంచి 12 వేల రూపాయల ఖర్చు రాగా యంత్రాల ద్వారా 3 నుంచి 5 వేల రూపాయల లోపు పని పూర్తిచేసుకొవచ్చు.

సబ్సిడీ సహకారం అవసరం..
ప్రభుత్వం పలు యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నది. నాగళ్లు, గొర్రులు, కేజీవీల్స్, ట్రాక్టర్లు, నూర్పిడి, నాట్ల యంత్రాలపై వివిధ రకాల సబ్సిడీ ఇచ్చింది. కలుపు పనిముట్ల యంత్రాలపై కూడా సబ్సిడీ అందిస్తే కలుపు పనులు సజావుగా సాగే అవకాశాలున్నాయి. వ్యవసాయంలో ట్రాక్టర్ల సంఖ్య బాగా పెరిగింది. నూర్పిడి యంత్రాలు ఉన్నాయి. ఇక కలుపు తీత యంత్రాలపై కూడా సబ్సిడీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన వివిధ రకాలుగా ఉపయోగపడే కలుపు తీత యంత్రాల తయారీకి, వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల సాగు పనుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...