ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి


Wed,September 11, 2019 01:01 AM

మేళ్లచెర్వు : గ్రామాల అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, 30 రోజుల కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మేళ్లచెర్వు గ్రామ పంచాయతీ కార్యాలయంలో 30 రోజుల కార్యాచరణపై నిర్వహించిన గ్రామసభకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల తర్వాత కొత్త పంచాయతీరాజ్‌ చట్టం నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతినెలా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 339 కోట్ల నిధులు అందిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై వేటు తప్పదన్నారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వులో గ్రామ కార్యాచరణ అమలు తీరుపట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి దాతలు సహకరించాలన్నారు. ప్రతి ఏటా మేళ్లచెర్వు గ్రామపంచాయతీకి రూ. 2.11 కోట్ల నిధులు వస్తున్నట్లు తెలిపిన ఆయన గ్రామాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇంటికి 6 మొక్కల చొప్పున గ్రామంలో 10 వేల చెట్లను నాటాలన్నారు. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రజలు నడుచుకుంటే ముఖ్యమంత్రికి చెప్పి గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అంతకు ముందు విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ఏమి కావాలో అందరూ కలిసి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీసి పనులు చేయించుకోవాలని సూచించారు. హరితహారంలో ప్రజల భాగస్వామ్యం తప్పక ఉండాలని, రోడ్ల పక్కన చెట్లను నాటాలని సూచించారు. శ్రమదానంతో గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలే కథానాయకులు కావాలన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమ రంగాలను ముఖ్యమంత్రి అధిక నిధులు కేటాయించారని చెప్పారు.

అర్హులైన వారందరికీ రైతుబంధు, రైతుబీ అందిస్తామని, రాష్ట్రంలో యూరియా కొరతను అధిగమిస్తామని తెలిపారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తానన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్‌ పాటించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు అధిక నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి విరాళాలు అందించిన దాతలను సన్మానించారు. ఈ సందర్భంగా మేళ్లచెర్వు గ్రామంలో రోడ్డుపైగాని, రోడ్డుపక్కనగాని చెత్త వేస్తే రూ.300 జరిమానా విధించనున్నట్లు గ్రామ సభ తీర్మానించింది. అంతేగాక చెత్తవేసిన వారితోనే చెత్త తీయించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంత్రులు మొక్క నాటారు. సర్పంచ్‌ శంకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దీపికాయుగంధర్‌రావు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఎస్పీ వెంకటేశ్వర్లు, జేసీ సంజీవరెడ్డి, ప్రత్యేకాధికారి ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి, ఎంపీపీ కొట్టె పద్మా సైదేశ్వరరావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, జిల్లా కోఆప్షన్‌ ఇమ్రాన్‌, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...