ఊరికి ప్రేమతో..


Wed,September 11, 2019 01:00 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కలిసి కట్టుగా పల్లె జనం నడుం కడుతున్నారు. తమ ఊర్లను తామే బాగు చేసుకునేందుకు ప్రతీ ఒక్కరూ గ్రామాల్లో ప్రత్యేక ఉద్యమమే చేపడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి 30రోజుల ప్రత్యేక ప్రణాళికతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన కార్యాచరణతో ప్రతీ పల్లె అబివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు మన ఊరు అభివృద్ధికి మనమే ముందంటూ పలువురు నిధులను సైతం విరాళంగా అందజేస్తున్నారు. మంగళవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామాభివృద్ధికి స్థానికులైన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోదరుడు జితేందర్‌రెడ్డి రూ.5లక్షలు, స్థానికుడైన సుంకరి మల్లేశ్‌గౌడ్‌ రూ.5లక్షలు విరాళం ప్రకటించారు.
మేళ్లచెర్వు అభివృద్ధికి రూ.కోటి...
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్ర అభివృద్ధికి దాతలు సుమారు రూ.కోటి విరాళం ప్రకటించారు. స్థానిక మైహోం సిమెంట్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రామశివారులో డంపింగ్‌ యార్డు నిర్మాణానికి సుమారు నాలుగు ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదే విధంగా గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణానికి గ్రామానికి చెందిన కంటి వైద్యుడు డా.జనార్దన్‌రెడ్డి రూ.10లక్షలు, రైతు శాగంరెడ్డి భద్రారెడ్డి రూ.5లక్షలు, అర్చకులు కొంకపాక వెంకటేశ్వరశర్మ, రాధాకృష్ణమూర్తి రూ.50వేల చొప్పున విరాళం ప్రకటించారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో విరాళం ఇచ్చిన దాతలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శాలువలతో సత్కరించి అభినందించారు. వీరితో పాటు మరి కొందరు తమ శక్తి మేర విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాభివృద్ధికి మరింత మంది ముందుకు రావాలని మంత్రులు ఆకాంక్షించారు.

డ్రైనేజీ శుభ్రం చేసి.. పిచ్చి మొక్కలు తొలగింపు..
దామరచర్ల : మండల పరిధిలో మంగళవారం కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రత్యేకాధికారి పీ నాగమణి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి కల్లేపల్లి, తిమ్మాపురం, తూర్పుతండా, కేజేఆర్‌కాలనీ, బొత్తలపాలెం, పుట్టలగడ్డ గ్రామాలను మంగళవారం పరిశీలించారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న డ్రైనేజీ పూడికతీతతో పాటు నీరు సరిగా వెళ్లని మురికి కాల్వలను పరిశీలించారు. కల్లేపల్లిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై గ్రామస్తులను చైతన్య పర్చారు. కేజేఆర్‌ కాలనీలో ఎంపీటీసీ వీరూనాయక్‌, సర్పంచ్‌ యమున ఆధ్వర్యంలో డ్రైనేజీలు శుభ్రం చేసి, మొక్కలు నాటారు. గ్రామస్తులు సహకారంతో కంపచెట్లు తొలగించారు. దామరచర్ల కాల్వల గట్టుపై మొక్కలు నాటారు.

మురికి కాల్వల్లో దోమల మందు పిచికారీ..
హుజూర్‌గనగర్‌రూరల్‌ మండల పరిధిలోని అమరవరంలో మంగళవారం జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ మురికి గుంటలు, కాల్వల్లో దోమల మందు పిచికారీ చేయించారు. అనంతరం జేసీబీతో రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చి, కంప చెట్లను తొలగించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుజాత, స్పెషల్‌ ఆఫీసర్‌ స్వర్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగారెడ్డి, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, విజయ, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పిచ్చి చెట్లు తొలగించి,మురుగు శుభ్రం చేశారు
ఆత్మకూర్‌.ఎస్‌ : మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం రోడ్ల వెంట పిచ్చి చెట్లు పీకి, కంపచెట్లను గ్రామస్తుల సాయంతో తొలగించి, చెత్త శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఏనుబాముల ప్రత్యేక అధికారి గుయ్యని ప్రసాద్‌, సర్పంచ్‌ ఎస్‌కే.వీరా, ఎంపీటీసీ గంపాల నాగేంద్ర, కార్యదర్శి ప్రసాద్‌, కో-అప్షన్‌ సభ్యులు మహాలక్ష్మి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పరమేష్‌ తదితరులున్నారు.

మురుగుకాల్వలు శుభ్రం..
పాలకవీడు : మండలంలోని రావిపహాడ్‌, కోమటికుంట, గుడుగుంట్లపాలెం, ఎల్లాపురం, గుండ్లపహాడ్‌ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. అంతర్గత మురుగు కాల్వల్లో పూడిక తీసి, బ్లీచింగ్‌ చల్లారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు కిష్టపాటి అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, పెద్దారాపు రామలక్ష్మమ్మ, తీగల లక్ష్మమ్మ, మలమంటి పద్మ, గ్రామ కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు వెంట కంప తొలగింపు..
మోతె : మండలంలోని లాల్‌ తండాలో మంగళవారం డోజర్‌ సాయంతో రోడ్డు వెంట కంపచెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్‌రెడ్డి, సీసీ నందు, సర్పంచ్‌లు ఉమా వెంకన్ననాయక్‌, బాణోతు ఝన్సీబాబునాయక్‌, కరుణసాగర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు గుర్తించి.. రికార్డుల్లో నమోదు చేసి..
మర్రిగూడ : మండలంలోని గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి సమస్యలను గుర్తించి రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. పారిశుధ్య సమస్యలు, పాత ఇండ్లు, పాడుబడిన బావులు, కంపచెట్లను తొలగించడంపై ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. గ్రామాల్లోని కంపచెట్లను తొలగించడంతో పాటు వీధులను శుభ్రం చేశారు. మరుగుదొడ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు, లేనివారికి మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హరితహారంలో బాగంగా అధికారులు నర్సరీలను పరిశీలించి, వాడవాడలా విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...