నాగార్జునసాగర్ క్రస్ట్‌గేట్ల ఎత్తివేత


Tue,September 10, 2019 03:25 AM

-కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతోంది.
-ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు
-పూర్తిస్థాయిలో నిండేందుకు మరో అడుగు దూరంలో ఉంది. దీంతో ఎన్నెస్పీ
-అధికారులు సోమవారం రాత్రి 7.30 గంటలకు సాగర్ 8 క్రస్ట్ గేట్లను ఎత్తి
-63288 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగు తున్నందున
-మరో రెండురోజుల పాటు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల ఉంటుందని అధికారులు ప్రకటించారు.

నందికొండ : నాగార్జునసాగర్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను నాగార్జునసాగర్ డ్యాం ఇన్‌చార్జ్ ఎస్‌ఈ(డిండి ప్రాజెక్ట్ ఎస్‌ఈ) విజయ్‌కరణ్‌రెడ్డి సోమవారం రాత్రి 7.30గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ 8 క్రస్ట్‌గేట్ల నుంచి 63,288క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 4క్రస్ట్‌గేట్లను 10అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 1,99,117 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారన్నారు. శ్రీశైలం నుంచి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదల కొనసాగుతుందని, ప్రస్తుతం రెండ్రోజులపాటు నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల ఉంటుందన్నారు. నీటి విడుదలపై లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

సాగర్@588.20అడుగులు..
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు సోమవారం రాత్రి 588.20అడుగులకు చేరి 306.6922టీఎంసీల నీరు నిల్వ ఉంది. అడుగు మేర నీరు వచ్చి చేరితే నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరనుండడంతో సాగర్ క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదలను ఎన్‌ఎస్పీ అధికారులు ప్రారంభించారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఆగస్టులో పూర్తిస్థాయిలోకి చేరడంతో ఆగస్టు 12 నుంచి 26క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించి 19వరకు 8రోజులపాటు కొనసాగించారు. కృష్ణమ్మ ఉధృతి ప్రారంభమైనప్పటి నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వస్తున్న వరదతో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ జలవిద్యుత్ కేంద్రాలు, ఎడమ, కుడి కాల్వల ద్వారా 350టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో తగ్గడంతో క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల నిలుపుదల చేసి జలవిద్యుత్ కేంద్రం, ఎడమ, కుడికాల్వ ద్వారా నీటిని వినియోగించడంతో సాగర్ నీటిమట్టం 590 అడుగుల నుంచి 585అడుగులకు చేరింది.

ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పునఃప్రారంభంతో ఆల్మట్టి, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం డ్యామ్‌లు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలుగా మారాయి. మళ్లీ కృష్ణా పరివాహక ప్రాజెక్ట్‌లన్నీ పరువళ్లు తొక్కుతున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా 7852క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 10,350క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32,805క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300క్యూసెక్కులు, డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నెల్) ద్వారా 10క్యూసెక్కుల, క్రస్ట్‌గేట్ల ద్వారా 63,288 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,17,005క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 884.50 అడుగుల వద్ద 211.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలానికి 3,54,106 క్యూసెక్కుల నీరు వస్తుంది.

పులిచింతల@174.07అడుగులు
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు)అడుగులకు ప్రస్తుతం 174.07(44.33 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 39,184 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. 70,655క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా విడుదలవుతోంది.
630.70అడుగులకు మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం 630.70(1.49 టీఎంసీలు)అడుగులుగా ఉంది. ఎలాంటి ఇన్‌ఫ్లో లేదని, కుడి, ఎడమ కాల్వలకు 225క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.


72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...