యూరియా..ఫుల్‌ స్టాక్‌


Sun,September 8, 2019 11:27 PM

-దుబ్బాకలో రైతులకు అందుబాటులో యూరియాపంటల అవసరాల మేరకు పంపిణీ
-ఎరువుల పంపిణీ తీరునుపరిశీలించిన అధికారులు
దుబ్బాక టౌన్‌ : దుబ్బాక మండలంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రైతుల అవసరాల మేరకు యూరియాను అందుబాటులో ఉంచడంతో పాటు పంపిణీ తీరును వ్యవసాయశాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏర్పడిన యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియాను అందజేస్తున్నారు. ఈ వానకాలం సీజన్‌లో పంటలకు అనుకూలంగా వర్షాలు కురియడంతో ఆగస్టు చివరి వారం నుంచి యూరియాకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడటంతో కొంత కొరత ఏర్పడినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు అందే విధంగా చూస్తున్నారు. ఈ సీజన్‌లో యూరియా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 16వేల 940 బస్తాల యూరియాను తెప్పించి రైతులకు ఇప్పటివరకు అందజేసినట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ అమ్మన రవీందర్‌రెడ్డి తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియాను అందజేస్తున్నప్పటికీ యూరియా కొరత ఏర్పడిందన్న అపోహతో రైతులు ఆందోళనకు గురవుతున్నారే తప్పా మరొకటి లేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇతర జిల్లాల రైతులతో ఇక్కడ ఇబ్బందులు..
ఇతర జిల్లాలకు సరిహద్దుగా దుబ్బాక ఉండడంతో ఆ జిల్లాలకు చెందిన రైతులు యూరియా కొనుగోలు కోసం రావడంతో దుబ్బాక ప్రాంత రైతులకు యూరియా కొరత ఏర్పడింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన కామారెడ్డి జిల్లా బీబీపేట, దోమకొండ, తుజాల్‌పూర్‌, రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌, సిద్దిపేట జిల్లా చింతమడక, రావురూకుల తదితర గ్రామాల నుంచి రైతులు యూరియా కోసం దుబ్బాకకు రావడంతో కొంత కొరత ఏర్పడిందని వ్యవసాయశాఖ అధికారులు చెపుతున్నారు. ఈ ప్రాంత రైతులకు సరిపడే యూరియాను దుబ్బాక పీఏసీఎస్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం రెండు లారీలతో పాటు ఓ డీసీఎం వ్యానులో యూరియా బస్తాలను తెప్పించిన అధికారులు రైతులకు అందుబాటులో ఉంచారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...