ఆ నాలుగే కీలకం


Wed,September 4, 2019 11:05 PM

-పారిశుధ్యం, పచ్చదనం, నిధుల సక్రమ వినియోగం, పవర్‌వీక్
-వీటిపైనే అధికారులు, నాయకులు దృష్టి సారించాలి
-30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తాం
-రాష్ట్రంలో మొదటి స్థానం కావాలి
-నాటిన మొక్కల్లో 85శాతం బతుకాలి.. లేకుంటే చర్యలు తప్పవు
-కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
-సిద్దిపేటలో కార్యాచరణ అమలు అవగాహన సదస్సు
-హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లాను 30 రోజుల ప్రణాళిక అమలులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలో రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సిద్దిపేట డివిజన్ గ్రామ పంచాయతీ ప్రణాళిక కార్యాచరణ అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు నాలుగు అంశాలైన పారిశుధ్యం, పచ్చదనం, నిధుల సక్రమ వినియోగం, పవర్ వీక్ విద్యుత్ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు గ్రామాల్లో ప్రజలకు పంచాయతీరాజ్ చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా సిద్దిపేట జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను ముందంజలో నిలుపుతున్నామన్నారు.

రాష్ట్రస్థాయిలో 120మంది సీనియర్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే 30 రోజుల ప్రణాళిక అమలును వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి ర్యాంకులు ఇస్తారన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా మురికి కాల్వలు, రహదారుల పరిశుభ్రత, పాడుబడ్డ గోడలను తొలగించడం, బావులను పూడ్చడం వంటి కార్యక్రమాలు చేపట్టి, చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలు తొలగించి డంప్ యార్డుల్లో వేయాలని సూచించారు. గ్రామాలకు కేటాయించిన అధికారి గ్రామ ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేసినప్పుడే అధికారి విజయవంతంగా ముందుకెళ్తాడన్నారు. పచ్చదనంలో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారానికి సంబంధించి పంచాయతీ నర్సరీ ఏర్పాటు చేసి ఆ బాధ్యతను తీసుకొని గ్రామ అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలన్నారు. ప్రతి పంచాయతీ ట్రాక్టర్ కొనడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ పథకంలో 1200 మొక్కలు నాటి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తే రూ.3.70 లక్షలు వస్తాయని చెప్పారు. ఇక నుంచి నేరుగా ఈజీఎస్ ద్వారా వచ్చే నిధులు గ్రామ పంచాయతీకి చెల్లింపులు చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈజీఎస్‌ను పూర్తిగా గ్రామ పంచాయతీల్లో అప్పగించడం జరుగుతుందన్నారు. నిధుల నిర్వహణలో భాగంగా పాలకవర్గం ప్రతి రెండు నెలలకొకసారి గ్రామసభ నిర్వహించాలన్నారు. పవర్ వీక్‌లో భాగంగా అవసరమున్న చోట వీధి స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మీలో ఒకడిగా పాల్గొంటాను అని చెప్పారు. ఐదేండ్ల కాలంలో గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించానని, ఆ క్రమంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు వారి సమస్యలను తెలిపారని, వారి సమస్యలను సానుకూలంగా విని పరిష్కరించే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కృషి చేశానని తెలిపారు. గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు, పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లోని భూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ధైర్యంగా పని చేయాలని, రాష్ర్టానికి ఆదర్శంగా ఉండేలా సర్పంచులు మంచి పరిపాలన అందించాలని సూచించారు. మిషన్ భగీరథలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడంతో జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చేసుకున్నామన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశం ప్రకారం ఎన్ని సమస్యలు ఉన్న 30రోజుల ప్రణాళిక అమలును సమర్థవంతంగా పూర్తి చేసి, మంచి పేరు తేవాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచన ప్రకారం 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదామని, ఇందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఇన్‌చార్జి సీఈవో, డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, డీపీవో సురేశ్‌బాబు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...