చెకువులు నింపుతాం


Mon,August 26, 2019 02:55 AM

మత్స్యకారులకు మంచి రోజులు
-138 చెరువుల్లో రూ.56.40 లక్షల సబ్సిడీ చేపపిల్లలు
-మట్టి వినాయకుల ఏర్పాటుపై చైతన్యం తేవాలి
-యువతలో మార్పు తీసుకురావాలి
-సిద్దిపేట నుంచే నాంది పలుకుదాం
-ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
-మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
-కోమటి చెరువులో లక్షా 20 వేల చేపపిల్లల విడుదల
-పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దసరా నాటికి గోదావరి జలాలతో జిల్లాలోని చెరువులను నింపుతాం.. మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. మొగులుకు ముఖం పెట్టి చూసే రోజులు త్వరలో పోనున్నాయి. మత్స్యకారులు ఆనందంతో జీవించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నది’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని కోమటి చెరువులో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన 1.20లక్షల చేప పిల్లలను జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణతో కలిసి వదిలారు. అలాగే, సిద్దిపేట పట్టణం, నంగునూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీడీవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా సదస్సు మహాసభకు హాజరయ్యారు. డిగ్రీ కళాశాల మైదానంలో ఫిట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కే రన్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడారు. ఇప్పటికే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయానికి చేరుకున్నాయని, త్వరలోనే రంగనాయకసాగర్‌కు రానున్నాయన్నారు. యువత ఫోన్‌ వ్యసనంతో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, యువతలో మార్పు రావాలని, దానికి మన సిద్దిపేట నుంచే నాంది పలకాలని పిలుపునిచ్చారు.
క్ట్రరేట్‌, నమస్తే తెలంగాణ: మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వులు ఉండే రోజులు త్వరలో రానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దసరా నాటికి అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపుతాం. మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. మత్స్యకారులు ఆనందంతో జీవించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట కోమటి చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందిస్తున్న లక్షా 20 వేల చేప పిల్లలను జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణతో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు వంద శాతం సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వర్షాలు లేక ఒక చెరువు కూడా నిండలేదని త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీళ్లు నింపుతామన్నారు. ప్రభుత్వం మార్కెట్‌ సౌకర్యాన్ని పెంచుకునేందుకు మత్స్యకారులకు ఆటోలు, మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నదన్నారు.

సిద్దిపేట నియోజకవర్గంలో 138 చెరువుల్లో రూ.56.40 లక్షలతో సబ్సిడీని ప్రభుత్వం భరిస్తూ చేప పిల్లలను రూపాయి ఖర్చు లేకుండా మత్స్యకారులకు అందిస్తుందన్నారు. సిద్దిపేటలో మత్స్యకారులకు అనువుగా ఉండేలా అధునాతన సౌకర్యాలతో మార్కెట్‌ను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని చింతల్‌చెరువులో 54 వేల చేప పిల్లలను మత్స్యశాఖాధికారులు, మత్స్యకారుల సంఘం నాయకులతో కలిసి చెరువులోకి వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, సుడా డైరెక్టర్‌, కౌన్సిలర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు పాల సాయిరాం, కొండం సంపత్‌రెడ్డి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు పొన్నాల నర్సింలు, డైరెక్టర్‌ అక్కారపు సత్యనారాయణ, మత్స్యకారుల సంఘం నాయకులు గౌటి అశోక్‌, గౌటి మల్లేశం, గౌటి రాజు, కౌన్సిలర్‌ లక్ష్మి సత్యనారాయణగౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...