త్వరలోనే సిద్దిపేటకు అంబికా దర్బార్‌ అగర్‌బత్తీ ఇండస్ట్రీ


Mon,August 26, 2019 02:46 AM

సిద్దిపేట అర్బన్‌ : ‘బీడీలు చుడితేనే మీ బతుకు బండి సాగుతున్నది..కానీ, నాకు మీ ఆరోగ్యాలను కాపాడడం ముఖ్యం.. మీ ఆరోగ్య రక్షణకు అండగా నేనుంటా..సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో బీడీలు చుట్టే ప్రతి ఒక్క అక్కా,చెల్లెలికి, మహిళా కార్మికులకు త్వరలోనే మాస్కులు అందిస్తానని’ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట కొండ భూదేవిగార్డెన్స్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా సదస్సు మహాసభకు జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మతో కలిసి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఏండ్లకు ఏండ్లు కష్టపడి పని చేసినా చేతిలో చిల్లి గవ్వలేని దయనీయ పరిస్థితి ఉండేది. కానీ, మన రాష్ట్రం ఏర్పాటు అయ్యాక బీడీ కార్మికులకు జీవన బృతి అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సీఎం కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు మహిళలకు వరంగా మారాయని, గతంలోని ప్రభుత్వాలు పాలకులు ఎవరూ పట్టించుకోని మహిళా లోకాన్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మానవీయ కోణంలో పథకాలు అమలు చేసి అక్కున చేర్చుకున్నదని చెప్పారు. త్వరలోనే సిద్దిపేటకు అంబికా దర్బార్‌ అగర్‌బత్తి ఇండస్ట్రీని తీసుకొచ్చే యోచనలో ఉన్నాని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహిళాబీడీ కార్మికులతో మాట్లాడుతూ..ముఖ్యంగా మీరు చుట్టే బీడీలతో తెలియకుండానే రోగాలకు గురువుతున్నారని, బీడీలు చుట్టడం పని పూర్తయిన వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోవాలని ఆరోగ్య నియమాలు చెప్పారు. మీ ఆరోగ్యాలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ఆరోగ్యాన్ని కాపాడేందుకోసం తన సొంత డబ్బులతో బీడీలు చుట్టే ప్రతి అక్కా, చెల్లెలికి మాస్కులను త్వరలోనే అందజేసి , ఆరోగ్యం కాపాడేందుకు అండగా ఉంటానని చెప్పారు. మాస్కులు ధరించి బీడీలు చుట్టడం ద్వారా 75 నుంచి 80 శాతం వ్యాధుల బారిన పడకుండా ఉంటామని, మాస్కులు లేకుండా బీడీలు చుడితే వచ్చే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. ఈ మేరకు మీ అందరికి మాట ఇచ్చిన ప్రకారం మాస్కులు అందజేస్తానంటూ..తనకు కావాల్సిన రెండు పనులు చేస్తామని మాట ఇవ్వాలని, వాటిలో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు, బీడీలు చుట్టడం అయిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవడం చేస్తామని మాట ఇవ్వాలని కోరగా ..మహిళలంతా చేస్తామని మూకుమ్మడిగా చెప్పారు. ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉండాల్సిన ఆ వశ్యకథ గురించి చెబుతూ..అన్ని గ్రామాలకు ఇంటికో వేప చెట్టు పంపిస్తానని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా దవాఖానకు పోకుండా ఉండాలని అప్పుడే తాను అనుకున్న ఆరోగ్య సిద్దిపేట సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర బీడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు రూప్‌సింగ్‌, రాష్ట్ర బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అల్లి నర్సయ్య, తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంచె నర్సింహులు,టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి నర్సింహులు, టేకేదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ, టేకేదారుల సంఘం ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఐలారెడ్డి, లక్ష్మణ్‌, మౌలానా, మధు, లక్ష్మణ్‌, నర్సింహులు, నారాయణ, సిద్ధేశ్వేర్‌, ఎక్బాల్‌, శోభన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...