ఒకే ఒక్కటి


Fri,August 23, 2019 01:19 AM


-ఒక గ్రామంలో ఒకే విఘ్నేశ్వరుడు
-ఇప్పటివరకు ఏడు గ్రామాల్లో తీర్మానం
-పర్యావరణంపై గ్రామస్తుల్లో పెరుగుతున్న చైతన్యం
-మట్టి విగ్రహాల ఏర్పాటుపైనా ఆసక్తి
-నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సిద్దిపేట నియోజకవర్గం

మిట్టపల్లి గ్రామం స్ఫూర్తితో..
గ్రామంలోని ప్రజలందరు ఐక్యంగా ఉండి ఒకే వినాయకున్ని నిలుపడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయకున్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. మొదటిసారిగా సిద్దిపేట నియోజకవర్గంలోని అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామస్తులంతా ఐక్యమై, ఒకే వినాయకున్ని నిలిపి గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు. ఇలా గ్రామం మొత్తానికి ఒకే వినాయకున్ని నిలుపడం ద్వారా గ్రామంలో సంఘటిత శక్తి పెరుగుతుంది. పేద, ధనిక అనే తారతమ్యాలు తొలిగి, భగవంతుడి సేవలో గ్రామస్తులు అందరూ పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం, మానవీయ విలువలు పెరుగుతాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచిస్తున్నారు. మిట్టపల్లి గ్రామం స్ఫూర్తితో నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాంపూర్, మాచాపూర్, బండచర్లపల్లి, నారాయణరావుపేట మండల పరిధిలోని కోదండరావుపల్లి, అర్బన్ మండలంలోని కిష్టసాగర్, నంగునూరు మండలం బద్దిపడగ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకొచ్చాయి.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఒకే వినాయకున్ని నిలిపేందుకు గ్రామంలోని మహిళలు, యువజన సంఘాలు, రైతులు, ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలు ఒకే తాటిపైకి రావాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచిస్తున్నారు. గతంలో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 500 నుంచి 600 విగ్రహాలు సిద్దిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని వాడవాడలా యువజన సంఘాలతో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టించి పూజలు జరిపే వారు. తొమ్మిది రోజుల పాటు జరిగే గణేశ్ నవరాత్రోత్సవాలకు రసాయనిక మిశ్రమాలతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలను తయారు చేసి ప్రతిష్టించే వారు. నవరాత్రుల అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం జరుగుతుండేది.

ఏడేండ్లుగా మట్టి విగ్రహాల పంపిణీ
ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించి, చెరువుల్లో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం జరిగేది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి వినాయక చవితికి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. తద్వారా యువతకు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని సందేశం పంపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు పట్టణంలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాయి. ఈ సారి సెప్టెంబర్ 2న జరుగబోయే వినాయక చవితికి గ్రామాల్లో ఊరంతా కలిసి ఒకే మట్టి వినాయకున్ని నిలుపాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచనలతో ఇప్పటికే ఏడు గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలివ్వగా, మరిన్ని గ్రామాలు అదేబాటలో నడువనున్నాయి.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...