గోదారమ్మ..గలగలలు


Mon,August 19, 2019 12:17 AM

-తపాస్‌పల్లి, లద్నూరు జలవనరులకు గోదావరి జలాలు
-నిండుకుండలా మారుతున్న జలాశయాలు
-కొనసాగుతున్న నీటి పంపింగ్ఫేజ్ 2,3 పంపుల ద్వారా నీటి సరఫరా
చేర్యాల, నమస్తే తెలంగాణ : నిత్యం కరువు ప్రాంతాలైన చే ర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు సాగు నీరు అం దించేందుకు నిర్మించిన తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్‌లు గోదావరి జలాల రాకతో నిండుకుండలా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో జలసిరులు కురిపించేందుకు నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం రెండో ,మూడో దశలలో 0.3టీఎంసీ (టెలి మెట్రిక్ క్యూబీక్) సామర్ధ్యం కలిగిన తపాస్‌పల్లి, 0.2టీఎంసీ సామర్థ్యం కలిగిన లద్నూరు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేసి కాల్వల ద్వారా చెరువులు నింపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. త్వరలోనే రిజర్వాయర్ ద్వారా చెరువుల్లోకి గోదావరి జలాలను పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, రిజర్వాయర్లకు నీటి సరఫరా తదితర అంశాల పై అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడం, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఆ ఫలాలు రైతాంగానికి అందనున్నాయి.

రిజర్వాయర్లకు 60 శాతం జలాలు
కొమురవెల్లి మండలం ఐనాపూర్-తపాస్‌పల్లి గ్రామాల శివార్ల మధ్య తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను 0.03టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్ కింద 67 వేల ఏకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలో 0.2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించారు. లద్నూరు రిజర్వాయర్ ద్వారా 40 వేల ఏకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలోకి 60 శాతం నీరు చేరుకుంది. ఆయా రిజర్వాయర్ల నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా గోదావరి జలాలను చెరువులకు పంపింగ్ చేసి నింపనున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఘననీయంగా పెరిగి, పంటలు పండనుండడంతో రైతాంగం సంతోషంగా ఉంది .జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారం ప్రాంతంలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు నుంచి వరంగల్ రూరల్ జిల్లాలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌కు అక్కడి నుంచి జనగామ జిల్లాలోని గండిరామారం రిజర్వాయర్ అనంతరం బొమ్మకూరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు ప్రత్యేక మోటర్ల ద్వారా వస్తాయి. అక్కడి నుంచి బొమ్మకూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన అనంతరం కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు రెండు పంపుల ద్వారా, లద్నూరు రిజర్వాయర్‌కు నీటి సరఫరా అవుతుంది. ఇటీవల ప్రారంభమైన ప్రారంభమైన నీటి పంపింగ్ నవంబర్ చివరి మాసం వరకు కొనసాగుతుందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. పంపుల మరమ్మతులతో పాటు దేవాదుల ప్రాజెక్టు వద్ద ఇన్‌టెక్ వెల్స్‌లో టెక్నికల్‌గా ఏదైనా సమస్యల తలెత్తితే తప్ప తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్‌లకు నీటి పంపింగ్ నిత్యం కొనసాగే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

దేవాదుల మూడో దశలో రెండు రిజర్వాయలకు నీరు
తపాస్‌పల్లి రిజర్వాయర్‌తో పాటు మద్దూరు మండలంలోని లద్నూరు రిజర్వాయర్‌కు దేవాదుల మూడో దశలో గోదావరి జలాలను నీటి పారుదల శాఖ అధికారులు పంపింగ్ చేస్తున్నారు. గతంలో ఫేజ్-2లో కేవలం తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటి సరఫరా అయ్యేది. టీఆర్‌ఎస్ సర్కార్ జనగామ నియోజకవర్గంలోని చేర్యాల,కొమురవెల్లి,బచ్చన్నపేట మండల రైతులతో పాటు మద్దూరు,గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలోని పలు చెరువులకు నీటిని అందించేందుకు పెండింగ్‌లో ఉన్న ఫేజ్-త్రీ పైపు లైన్ పనులు, భూ సమస్యను పరిష్కరించి ఫేజ్ త్రీ ద్వారా తపాస్‌పల్లి, లద్నూరు, నర్మెట్ట మండలంలోని కన్నెబోయినగూడెం, వెల్దండ రిజర్వాయర్లకు గోదావరి జలాలను గత సంవత్సరం ప్రారంభించారు. ఈ ఏడాది గోదావరిలో పుష్కలంగా నీరు ఉండడంతో ఇప్పటికే ఆయా రిజర్వాయర్లకు 60 శాతం మేరకు నీరు చేరుకుంది. తపాస్‌పల్లికి రెండో దశలో ప్రస్తుతం ఉన్న పైపు లైన్ల ద్వారా 15 మిలియన్ల క్యూబిక్ ఫీట్ల నీరు సరఫరా అవుతున్నది, ఇక మూడో దశలో అదనంగా నిర్మించిన పైపు లైన్ల ద్వారా మరో 10.02 మిలియన్ల క్యూబిక్ ఫీట్ల జలాలను పంపింగ్ చేస్తున్నారు.

ఈ ఏడాది 200 చెరువులు నింపడమే లక్ష్యం
తపాస్‌పల్లి ,లద్నూరు రిజర్వాయర్‌ల్లోకి 60 శాతం పైగా గోదావరి జలాలలు చేరుకున్నాయి. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రిజర్వాయర్‌లలోకి నీరు రాగానే చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, బచ్చన్నపేట మండలాల్లోని పలు గ్రామాల చెరువులు నింపేందుకు సంబంధిత శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు మండలాల్లో(చేర్యాల, కొమురవెల్లి, బచ్చన్నపేట,మద్దూరు) మొత్తం 150 చెరువులను గత సంవత్సరం నింపారు. ఈ సంవత్సరం నీరు పుష్కలంగా పంపింగ్ అయ్యే అవకాశం ఉన్నందున్న 200 చెరువులు నింపేందుకు ప్రణాళికలు రూపొంచినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
మల్లన్న భక్తులకు గోదావరి జలాలు
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో నీటి సమస్య లేకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరం మల్లన్న చెరువులోకి గోదావరి జలాలను ప్రత్యేక శ్రద్ధతో మొదటి దశలోనే పంపింగ్ చేస్తున్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు భారీ సంఖ్యలో వస్తుండడంతో వారికి ఎ లాంటి నీటి సమస్యలు తలెత్తకుండా మల్లన్న చెరువును పూర్తి స్థాయిలో నింపుతున్నారు. దీంతో మూడు మాసాల పాటు వేలాదిగా తరలివచ్చే భక్తులకు నీటి సమస్య తలెత్తకుండా ఉండడంతో పాటు కొమురవెల్లి క్షేత్రంలో బోరుబావిలో భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య లేకుండా పోయింది.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...