వాయువేగం


Sat,August 17, 2019 10:57 PM

-శరవేగంగా సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ భవన నిర్మాణాలు
-అత్యాధునిక హంగులతో భవనాలు
-దసరా నాటికి పూర్తి చేసే లక్ష్యంగా పనులు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దసరా నాటికి పూర్తి చేసే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. భవన నిర్మాణ పనులు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా పనులు నడుస్తున్నాయి. సుడా పరిధిలోని కొండపాక మండలం దుద్దెడ, మర్పడగ గ్రామాల శివారులో 2017 అక్టోబర్ 11న సమీకృత కలెక్టరేట్ భవనం, పోలీసు కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని జీ+2 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఇదే సముదాయంలో కలెక్టర్, జేసీ, డీఆర్వోల కుటుంబాలు నివసించడానికి జీ+1 పద్ధతిలో భవనాలు సిద్ధమవుతున్నాయి. రూ.12 కోట్లతో పోలీసు కమిషనరేట్ కార్యాలయాలన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులను ఎప్పటికప్పుడు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్ డెవిస్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు.

శరవేగంగా సమీకృత కలెక్టరేట్ భవనం
సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ భవన నిర్మాణ స్థలా న్ని స్వయంగా పరిశీలించి ఎంపిక చేశారు. రూ.50 కోట్లతో కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. 50 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆధునీక వసతులతో ప్రభుత్వ కార్యాలయాల సమహారం శరవేగంగా నిర్మాణం జరుగుతున్నది. లక్షా 68 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+2 పద్ధతిలో సుమారు 70 శాఖలకు సరిపడేలా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. 3 సెమినార్ హాళ్లు, ఆధునీక వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 500మంది కూర్చుని సమావేశం నిర్వహించుకునేలా ఆడిటోరియం నిర్మాణమవుతున్నది. ఒక్కో అంతస్తులో 58వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారుల కోసం 5 ప్రత్యేక క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నారు. కార్యాలయాల్లో సిబ్బందికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు, ప్రజలు, సందర్శకులకు వేర్వేరుగా వాహనాలు నిలుపు స్థలాలను కేటాయిస్తున్నారు. పచ్చదనం ఆహ్లాదభరితంగా ఉండేలా ఉద్యాన వనాలను హైవేను తలపించేలా అంతర్గత రోడ్లను నిర్మిస్తున్నారు.

రూ.12 కోట్లతో పోలీసు కమిషనరేట్
సిద్దిపేట జిల్లా పోలీసు కమిషనరేట్ నూతన కార్యాలయాన్ని రూ.12 కోట్లతో అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. 16,566 చదరపు అడుగుల గ్రౌండ్ ఫ్లోర్, 16,289 చదరపు అడుగుల ఫస్ట్ ఫ్లోర్, 16,289 అడుగుల సెకండ్ ఫ్లోర్‌తో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డు ఎండీ మల్లారెడ్డి, సీపీ జోయల్ డెవిస్‌తో కలిసి కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. మొత్తం 60 వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల భవనాన్ని 120 పిల్లర్స్‌తో నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో పెయింటింగ్, పుట్టి వర్క్, సెకండ్ ఫ్లోర్‌లో సిమెంట్ వర్క్ పనులు, కిటికీలు, గ్లాస్ డోర్స్ బిగిస్తున్నారు. దాదాపు 80శాతం మేర కమిషనరేట్ కార్యాలయ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ పనులను ఎప్పటికప్పుడు సీపీ జోయల్ డెవిస్ పర్యవేక్షిస్తున్నారు.

దసరాకు ప్రారంభించేలా ఏర్పాట్లు
ఆధునిక హంగులు, వసతులతో శరవేగంగా నిర్మాణమవుతున్న సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కమిషనరేట్ భవనాలను దసరాకు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10రోజుల కిందట మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి కలెక్టరేట్ భవన నిర్మాణాలను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా ఎల్‌ఈడీ బల్బుల వెలుగులో పనులు నిర్వహిస్తున్నారు. పనుల నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా పక్కా ప్రణాళికతో భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...