శరవేగంగా కలల సౌధం


Fri,August 16, 2019 11:07 PM

-నిర్మాణాల్లో నియోజకవర్గం ముందంజ
-నియోజకవర్గానికి 3,439 ఇండ్లు మంజూరు
-2,962 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం
-నిర్మాణాలు పూర్తి చేసుకున్న 769 ఇండ్లు
-వివిధ దశల్లో 2,193 ఇండ్ల నిర్మాణాలు
-ఇప్పటికే 75 ఇండ్లల్లో గృహ ప్రవేశాలు
-పట్టణంలో వెయ్యి ఇండ్లతో మోడల్‌కాలనీ

దుబ్బాక, నమస్తే తెలంగాణ: డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం దుబ్బాక నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్నది. వాయువేగంతో నిర్మాణాలు జరుగుతుండగా, నిర్మాణాల్లో జిల్లాలోనే దుబ్బాక మొదటి స్థానంలో నిలిచింది. నియోజకవర్గానికి 3,439 ఇండ్లు మంజూరు కాగా, 2,962 నిర్మాణాలు ప్రారంభించారు. ఇందులో 769 గృహాలు పూర్తవగా, మరో 2,193 వివిధ దశల్లో ఉన్నాయి. పిట్టలవాడ, చిట్టాపూర్, పరశురామ్‌నగర్ గ్రామాల్లో నిర్మించిన 75 ఇండ్లలోకి లబ్ధిదారులు ఇప్పటికే గృహ ప్రవేశాలు చేశారు. దుబ్బాక పట్టణంలో జీ+2 పద్ధతిలో నిర్మిస్తున్న గృహ సముదాయం తుది దశకు చేరుకున్నది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిరంతర పర్యవేక్షణలో గ్రామాల్లో పనులు చురుకుగా సాగుతున్నాయి.

దుబ్బాకలో దూకుడుగా..
దుబ్బాక నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు మెరుపు వేగంతో కొనసాగుతున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రత్యేక చొరవతో ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇండ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే రామలింగారెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తూనే, మరో పక్క నిర్మాణాల్లో పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గానికి 3,439 ఇండ్లు మంజూరు కాగా, 2962 గృహాల పనులు ప్రారంభించారు. ఇందులో 769 నిర్మాణాలు పూర్తి కాగా, మరో 2,193 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు సహకారంతో దుబ్బాక నియోజకవరార్గానికి అత్యధిక డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయించారు. అంతేగాక గృహ నిర్మాణాల్లో దుబ్బాక నెం.1గా నిలిచింది.

గ్రామాల్లో వేగవంతంగా గృహాలు నిర్మించి, దశలవారీగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో వెయ్యి ఇండ్లు వేగవంతంగా నిర్మాణాలు చేపట్టారు. దుబ్బాకలో సీఎం కేసీఆర్ చదువుకున్న బడి సమీపంలో బల్వంతాపూర్ రోడ్డులో 11 ఎకరాల్లో వెయ్యి ఇండ్లు నిర్మిస్తున్నారు. మోడల్ కాలనీగా 76 బ్లాక్‌లు నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 12 ఇండ్ల చొప్పున వెయ్యి ఇండ్లు నిర్మించారు. ఇందులో కాలనీ ప్రజల సౌకర్యార్థం కోసం షాపింగ్ కాంప్లెక్స్, రైతుబజార్, కమ్యూనిటీహాల్, చావడీలతో పాటు సమ్మక్కసారలమ్మ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు.

సాకారమవుతున్న సొంతింటి కల
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంతో గూడు లేని పేదల సొంతింటి కలను నెరవేరుతుండగా, లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. నియోజకవర్గంలో గ్రామాగ్రామాన డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణాలు జోరందుకోగా, విడుతల వారీగా పేదల కల సాకారమవుతున్నది. ఇప్పటికే నియోజకవర్గంలో తొగుట మండలం పిట్టలవాడలో 25, వెంకట్రావ్‌పేటలో 60, దుబ్బాక మండలం పరశురామ్‌నగర్‌లో 25, చిట్టాపూర్‌లో 50 , దౌల్తాబాద్ మండలం అప్పాయిపల్లిలో 25 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందజేశారు. అదేవిధంగా దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో 30, పోతారెడ్డిపేటలో 50, చీకోడ్‌లో 65 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

3,420 ఇండ్లు మంజూరు
నియోజకవర్గంలో ఇల్లులేని ప్రతి నిరు పేదకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా చేపట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నియోజకవర్గంలో 2015-16లో 2,666ఇండ్లు, 2016-17లో 702 ఇండ్లు, సీఎం నిధుల కింద మరో 52 మొత్తం 3,420 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,263 ఇండ్లకు టెండర్లు పిలువగా, 3,080 ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయి. 2,962 ఇండ్ల పనులు ప్రారంభించగా, 2149 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. దుబ్బాక పట్టణంలో జీ+2 పద్ధతిలో వెయ్యి ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో కొత్త శోభ నెలకొంది.

మండలంలో లచ్చపేట, గంభీర్‌పూర్, పోతారెడ్డిపేట గ్రామాల్లో జీ+2 పద్ధతిలో ఇండ్లు నిర్మిస్తున్నారు. ఇండ్ల నిర్మాణాలు చేస్తున్న చోట అంతర్గత సీసీ రోడ్లు, మొక్కల పెంపకం, డ్రైనేజీ, విద్యుత్తు సరఫరా నీటి ట్యాంకులు తదితర వసతులు కల్పిస్తున్నారు. దుబ్బాక నగరపంచాయతీ పరిధిలోని ఒక్కో ఇంటి నిర్మాణానికి నిర్మాణ వ్యయం రూ.5.30 లక్షలు, వసతుల కల్పనకు రూ.1.25 లక్షలు ఖర్చువుతుండగా, గ్రామాల్లో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలకు నిర్మాణ వ్యయం రూ. 5.04 లక్షలు కాగా, మౌలిక వసతుల కోసం రూ.75 వేలు చొప్పున వెచ్చిస్తున్నారు. నిలువ నీడలేని నిరుపేదలకు, కిరాయి ఇండ్లలో దుర్భర జీవితాలను గడుపుతున్న వారికి ప్రభుత్వం అందజేస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు వరంగా మారాయి.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...