దవాఖానలో సౌకర్యాల కల్పనకు కృషి


Wed,August 14, 2019 10:49 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ సర్కార్ దవాఖానలో సకల సౌకర్యాల కల్పనకు ఆరోగ్యశాఖ మం త్రి ఈటల రాజేందర్ సహకారంతో తనవంతు కృషి చేస్తానని, వైద్యులు నిరంతరం దవాఖానలో రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం దవాఖానలో వైద్యులు, సిబ్బంది పనితీరు, వైద్య సేవలపై సమీక్ష సమావేశం జరిగింది. వైద్యులు, సిబ్బంది తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఇంకా కావాల్సిన సౌకర్యాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవాఖానలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నందున ఇప్పటికైనా పనితీరును మార్చుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. సర్కారు వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి దవాఖానలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్నందున ఈ దవాఖానను వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తేవాలని ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు.

అందులో భాగంగానే కొందరు స్పెషలిస్టు వైద్యులను కూడా నియమించారని, అయితే పూర్తి స్థాయిలో వైద్య విధాన పరిషత్‌కు మారనందున వైద్యులందరూ సమన్వయంతో ఉండి రోగులకు నాణ్యమైన సేవలందించాలన్నారు. స్పెషలిస్టులు, ఆపరేషన్ థియేటర్లు ఉండి కూడా సేవలు అందకపోవడం సరైంది కాదన్నారు. రాత్రిపూట తప్పకుండా డ్యూటీ డాక్టర్ విధులు నిర్వహించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఇతర భద్రతా చర్యలపై సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడుతానని, వైద్యులు మాత్రం తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో దవాఖానకు కావాల్సిన సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది విధులపై నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ప్రభాకర్, ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, అశోక్‌బాబు, ఆకుల వెంకట్, మ్యాక నారాయణ, గాదెపాక రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...