చుక్కేసి.. చిక్కేసి


Wed,August 14, 2019 12:10 AM

-మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు, వాహనాలు స్వాధీనం
-ఈ ఏడాది ఇప్పటివరకు 625 కేసులు నమోదు
-127 మందికి జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా
-తాగి నడపొద్దని సూచిస్తున్నా తీరు మారని వైనం
-మద్యం మత్తులోనే అత్యధిక ప్రమాదాలు
-పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్
-జిల్లాలో నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
గజ్వేల్‌టౌన్ : వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని అవగాహన కల్పిస్తున్నా కేసుల నమోదు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్, ఆర్‌టీఏ అధికారుల నిబంధనలు పాటించాలని చెప్పినా వినడం లేదు. జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రోజు సాయంత్రం సమయంలో బ్రీత్ ఎనలైజర్ ద్వారా ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రధాన రోడ్ల వెంబడి ప్రయాణం చేయడంతో మద్యం తాగిన వారి ప్రమాదాలే ఎక్కువవుతున్నాయి. దీంతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంటుంది. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 625 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీరిని కోర్టులోహాజరు పరుచగా 127 మందికి జైలు శిక్ష విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన వారికి సుమారు పది లక్షల రూపాయల జరిమానాలు విధించారు. వీటితో పాటు ప్రతి రోజు గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. రెండేండ్లుగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు నిబంధనలు పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు.

బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు..
మద్యం సేవించిన వ్యక్తి నోట్లో పైపు పెట్టి గాలి ఊదుమని చెప్పుతారు. గాలి ఊదితే బ్రీత్ ఎనలైజర్‌పై ఎంత శాతం మద్యం సేవించాడో తెలిసిపోతుంది. 30 శాతం దాటితే కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తారు. ఒక బీరు లేదా 15ఎంఎల్ మద్యం తాగితే 30 శాతం వరకు చూపిస్తుంది. మద్యం సేవించిన వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగానే వారు సేవించిన మద్యం శాతాన్ని తెలుపుతూ రసీదు వస్తుంది. మద్యం శాతాన్ని ఆధారంగా చేసుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి తరువాత కోర్టులో హాజరు పరుస్తారు. మద్యం సేవించిన తీరుబట్టి న్యాయమూర్తి జైలు శిక్షతో పాటు జరిమానాను విధిస్తారు.

ఒక్క రోజే 62 కేసుల నమోదు..
గత నెల 12న సిద్దిపేట, గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 62 కేసులను ఒక్క రోజే నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు చేసి కేసులు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరుచగా ఎక్కువ సంఖ్యలో జైలు శిక్ష పడుతున్నవి.

పాటించాల్సిన నిబంధనలు..
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడుపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికెట్‌ను తప్పకుండా దగ్గరే ఉంచుకోవాలి. కార్లు నడిపే వారు సీట్ బెల్టు ధరించి ఆర్‌టీఏ అధికారుల నిబంధనలు పాటించాలి. మైనర్ బాలురకు ద్విచక్ర వాహనం ఇస్తే తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడుపరాదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదు. పట్టణ ప్రాంతాల్లో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడుపాలి.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...