చెక్కుల పద్ధతికి చెక్


Wed,August 14, 2019 12:07 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు నూతన చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు గతంలో పంచాయతీ నిధుల వినియోగంలో పలు చోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలుండడంతో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించింది.గతంలో పంచాయతీ నిధుల వినియోగంలో సర్పంచ్, గ్రామ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది.టీఆర్‌ఎస్ సర్కారు నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించింది.ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సంతకాలను సేకరించి వాటిని డిజిటలైజ్ చేసేందుకు నిర్ణయించింది.జిల్లా వ్యాప్తంగా ఉన్న 499 గ్రామ పంచాయతీల సమగ్ర వివరాలు, సంతకాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు సేకరించారు. ఇక సంతకాల సేకరణ తదితర తతంగం పూర్తి అయిన వెంటనే డిజిటల్ కీ రూపొందించి చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టేందుకు యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.

సంప్రదాయ పద్ధతికి స్వస్తి?
గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు నిధుల వినియోగానికి సంబంధించిన చెక్కుల రూపంలో చెల్లింపులు జరిగేవి.ప్రతి గ్రామ పంచాయతీ బ్యాంక్ ఖాతాను తెరిచి నిధులు డ్రా చేసి ఖర్చు చేసేవారు.గ్రామ పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను డ్రా చేసేందుకు సర్పంచ్, కార్యదర్శి ఇద్దరూ చెక్కు పై సంతకం చేసి ట్రెజరీ కార్యాలయం వెళ్లి అక్కడ అధికారులు ఆమోదించిన అనంతరం బ్యాంకు నుంచి నిధులు డ్రా చేసే వారు.ఇదే సమయంలో కొందరు తప్పుడు వివరాలను సమర్పించి నిధులు కాజేసిన ఘటనలు ఉన్నాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెక్కుల ద్వారా చెల్లింపులకు స్వస్తి చెప్పనున్నారు.ఈ-పంచాయతీ ద్వారా బ్యాంకులకు వెళ్లకుండా డిజిటల్ కీ ద్వారా నేరుగా జీపీ నుంచి చెల్లింపులు జరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసుకోవాలంటే చెక్కు అవసరం లేదు.ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సర్పంచ్,ఉపసర్పంచ్‌ల డిజిటల్ సంతకాలను సరిపోల్చి పంచాయతీ అధికారులు అనుమతి తర్వాత డిజిటల్ కీ వస్తుంది. ఈ డిజిటల్ కీని ఆయా జీపీలకు సంబంధించిన ట్రెజరీ కార్యాలయాలకు అధికారులు సమర్పించనున్నారు.డిజిటల్ కీ ద్వారా ఇక చెల్లింపుల ప్రక్రియ కొనసాగనుంది.

ఇక పనులన్నీ ఆన్‌లైన్‌లోనే...
జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ ద్వారా పనులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.నూతన ఇంటి నిర్మాణ అనుమతులు, వ్యాపార లైసెన్స్‌లు, ఆస్థి మార్పిడి, లే అవుట్ అనుమతులకు సంబంధించిన సేవలను ఆన్‌లైన్‌లో చేపట్టనున్నారు. ఈ సేవలన్నింటికీ గ్రామపంచాయతీ కార్యదర్శిని ప్రధాన బాధ్యులుగా చేసి వారి సంతకాలను సైతం డిజిటలైజ్ చేస్తున్నారు.డిజిటల్ కీ ద్వారా గ్రామాల్లో చేసిన పనులు మొదట గ్రామపంచాయతీ కార్యదర్శి పని నివేదిక పరిశీలించి,ఈవోపీఆర్‌డీకీ నివేదిక అందించిన అనంతరం మంజూరైన అభివృద్ధి పనులపై గ్రామసభ నిర్వహించాలి. సభలో తీర్మానం చేసిన అనంతరం పని చేసేందుకు జీపీ అనుమతి ఇస్తుంది. గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రతి నెలకోసారి తప్పనిసరిగా ఈవోపీఆర్‌డీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించాలి. వరుసగా మూడుసార్లు గ్రామసభ నిర్వహించని పక్షంలో సర్పంచ్ పదవి నుంచి సస్పెన్షన్ చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు తయారు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పని పూర్తయిన తర్వాత ఈజీఎస్ చెల్లింపు విధంగా సర్పంచ్ ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వస్తుంది.

ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో ..
డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇక ఆన్‌లైన్‌లోనే ప్రజలకు సేవలందించనుంది.జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను గ్రామ పంచాయతీల్లో జారీ చేయనున్నారు. అన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుండడంతో ఇక అక్రమాలకు చోటు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.అదే విధంగా డిజిటల్ కీ తో మరింత పారదర్శకతలకు అవకాశం ఉంటుంది.

డిజిటల్ కీ ద్వారానే చెల్లింపులు
పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులతో చేపట్టే పనులకు ఇక నుంచి డిజిటల్ కీ ద్వారానే చెల్లింపులు జరుపనున్నారు.దీంతో జవాబుదారీ తనం పెరిగి తప్పుడు రికార్డులు, పనులు చేయకున్న చేసినట్లు చూపే అక్రమ మార్గాలకు అడ్డుకట్టపడనుంది.ఫోర్జరీ చేసి నిధులను స్వాహా చేసే యత్నాలకు తావుండదు. ఏ పనికి ఎన్ని నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది, ఎంత పని జరిగిందని పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి ఈవోపీఆర్డీకి రికార్డు రూపంలో అందజేస్తారు.ఈవోపీఆర్డీ జరిగిన పనిని పరిశీలించి ఎంపీడీవోకు నివేదికను సమర్పిస్తే ఆయన దానిని ఉన్నతాధికారులకు పంపిస్తారు.ఇప్పుడు డిజిటల్ కీ ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని తెలిపారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...