హుస్నాబాద్ ప్రాంత వరప్రదాయని గౌరవెల్లి రిజర్వాయర్


Wed,August 14, 2019 12:06 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ ప్రాంతానికి గౌరవెల్లి రిజర్వాయర్ వరప్రదాయని లాంటిదని, ఇది పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పూర్తి చేయిస్తున్నారన్నారు. ఏడాది లోపు హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలు రావడం ఖాయమన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని ఆరు వార్డుల్లో రూ.4.25కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా వార్డుల్లోని ప్రజలు, మహిళలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ఇచ్చి, రాఖీలు కట్టి ఆశీర్వదించారు. పలు వార్డుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గౌరవెల్లితో పాటు దీనికి అనుబంధమైన గండిపల్లి రిజర్వాయర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లతో ఇక్కడి బీళ్లను తడిపేందుకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. హుస్నాబాద్ పట్టణంలో గడిచిన ఐదేండ్లలో రూ.180 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఇందులో ప్రధానమైన డిపో, దవాఖాన బైపాస్‌రోడ్లు, వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ఐవోసీ భవన నిర్మాణం, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల భవనాలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పట్టణ అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో పట్టణంలో 70శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరుగుతుందన్నారు. పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఇందుకు సంబంధించిన సర్వే పనులు కూడా పూర్తయ్యాయన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్‌వన్ పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. కొందరు నాయకులు కావాలనే పట్టణ అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారని, వారికి ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, అక్కన్నపేట జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, రేషనల్ లేబర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, మేనేజర్ రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...