బీమ ధీమా


Mon,August 12, 2019 10:59 PM

-రైతుబీమా పథకం ఏడాది పొడిగింపు
-ఈ ఏడాది ప్రీమియం రూ. 3,457
-జిల్లాలో ఇప్పటివరకు 693 మంది రైతులు మృతి
-బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందిన పరిహారం

గజ్వేల్, నమస్తే తెలంగాణ : రైతు బీమా పెద్ద దిక్కు కోల్పోయిన రైతు కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకుంటున్నది. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అమలు చేసిన రైతు బీమా రైతన్నల మన్ననలను అందుకుంటున్నది. అడుగడుగునా ప్రమాదాలతో సహవాసం చేసే రైతుకు సీఎం కేసీఆర్ అందించిన రైతు బీమా కొండంత అండగా నిలించింది. జిల్లాలో మొదటి సంవత్సరమే 693 మంది రైతులు మరణించగా ఇప్పటికే 636 మంది రైతులకు రూ. 31 కోట్ల 80 లక్షల రైతు బీమా ఆర్థిక సాయం అందింది. ఇంకా 57 మందికి అందాల్సి ఉంది. అయితే ఈ సారి కూడా ప్రభుత్వం రైతుకు బీమా సౌకర్యాన్ని అమలు చేసింది. పెరిగిన ప్రీమియం డబ్బులు ఎల్‌ఐసీ సంస్థకు గడువుకు ముందే చెల్లించడంతో గత సంవత్సరం బీమా వర్తింపు ముగిసిన వెంటనే ఈ సంవత్సరం బీమా వర్తిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం అందించిన రైతు బీమా రెండో సంవత్సరం అందుబాటులోకి రానుంది. గత సంవత్సరం జిల్లాలో 1,39,359 మంది రైతులకు బీమా వర్తింపచేయగా 693 మంది రైతులు మరణించారు. ఇందులో 636 మంది బాధిత రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందింది. మొత్తం జిల్లాకు ఇప్పటి వరకు రూ.31 కోట్ల 80 లక్షల రూపాయలు అందగా మరో 2 కోట్ల 85 లక్షల రూపాయలు బీమా సంస్థ అందించాల్సి ఉంది. బీమాపై రైతుల్లో అవగాహన కల్పించడంతో అత్యధిక మంది రైతులు దీనిని గత సంవత్సరం వినియోగించుకున్నారు. అయితే ఈ సారి ఇంకా 1బీ, కొత్త పాస్ బుక్‌ల సంఖ్య పెరుగడంతో జిల్లా రైతుల సంఖ్య మరింత పెరుగవచ్చని జిల్లా వ్యవసాయశాఖ యంత్రాంగం చెప్తున్నది. ఇప్పటికే రైతులకు సంబంధించిన వివరాలు సంస్థకు పంపినట్లు తెలిస్తున్నది.

జిల్లాలోని 23 మండలాల్లో 1,39,359 మంది రైతులకు గత సంవత్సరం బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అత్యధికంగా దుబ్బాక మండలంలో 11,283 మందికి, అత్యల్పంగా కొమరవెల్లి మండలంలో 2,653 మంది రైతులకు వర్తించింది. ఏడాది వ్యవధిలో అత్యధికంగా చేర్యాల మండలంలో 57 మంది రైతులు మరణించగా ఇప్పటి వరకు 52 మంది రైతు కుటుంబాలకు 2 కోట్ల 60 లక్షల రూపాయల ఆర్థిక సహాయం బీమా సంస్థ నుంచి అందింది. అత్యల్పంగా కొమురవెల్లి మండలంలో 11 మంది రైతులు చనిపోగా 10 మంది కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింది.

ఒక్కో రైతుకు రూ. 3,457 ప్రభుత్వం చెల్లింపు
రైతు బీమా అమలు కోసం ప్రభుత్వం ఒక్కో రైతు పేరా రూ. 3,457 చెల్లిస్తున్నది. ఇందులో రూ. 2,930 ప్రీమియం 18 శాతం జీఎస్టీతో కలిపి మొత్తం ఒక్కో రైతు పై సంవత్సరానికి రూ. 3,457 చెల్లిస్తున్నది. దీంతో ఏడాది పాటు ప్రతి రైతుకు రూ. 5 లక్షల బీమా వర్తింపు ఉంటుంది. గత సంవత్సరం 14-8-2018 నుంచి అమల్లోకి రాగా ఈ సంవత్సరం 13-8-2019 వరకు ముగుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రీమియం చెల్లించడంతో తిరిగి 2019-20 సంవత్సరం రైతు బీమా అమల్లోకి రానుంది.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...