తెలంగాణది ఘన చరిత్ర


Sun,August 11, 2019 11:35 PM

-తెలంగాణ ఉద్యమానికి..సిద్దిపేటకు అవినాభావ సంబంధం
-సీఎం కేసీఆర్ పోరాట స్ఫూర్తి, జయశంకర్ సార్ మార్గదర్శనంతో..తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం
-సీఎం కేసీఆర్ జయశంకర్ సార్‌ను ఆకాశమంతా ఎత్తులో నిలిపారు
-1969 ఉద్యమకారుల చరిత్రను పుస్తకంగా తీసుకరావాలి
-సిద్దిపేట సమర స్ఫూర్తి స్వర్ణోత్సవ సభలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
-70 మంది తొలి దశ ఉద్యమకారులకు చేనేత వస్ర్తాలు, జ్ఞాపికతో సత్కారం

సిద్దిపేట ప్రతినిధి/కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి అరుదైన గౌరవం ఉంది. వందేండ్ల చరిత్ర కలిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం.. స్వాతంత్య్ర ఉద్యమానికి ఉన్న ఘన చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉంది.. తెలంగాణ ఉద్యమానికి, సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని తాడూరి బాలాగౌడ్ ఫంక్షన్ హాల్‌లో 1969 ఉద్యమ సమరస్ఫూర్తి స్వర్ణోత్సవ సభ జరిగింది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, సభ నిర్వహణ కమిటీ అధ్యక్షులు జి.పాపయ్య, రంగాచారి, పరమేశ్వర్‌లతో కలిసి తొలుత ముస్తాబాద్ చౌరస్తాలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల స్థూపం, జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతిప్రజ్వలన చేశారు. సిద్దిపేట జిల్లాలోని 1969 తెలంగాణ ఉద్యమకారులు 70 మందిని చేనేత వస్ర్తాలు, మెమెంటోలు అందజేశారు. అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ 1969లో తెలంగాణ పోరాటంలో 369 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దాదాపు వందేండ్ల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ విలీనం నుంచి స్వరాష్ట్ర కాంక్షను వెలిబుచ్చుతూ మొదటి ఎస్సార్సీ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ రాష్ట్రం కోసం రిపోర్టులు ఇచ్చిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అన్నారు. 2001 నుంచి సీఎం కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచారన్నారు. అసెంబ్లీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మేం ఎలుగెత్తి చాటామంటే దాని వెనుక సీఎం కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ సిద్ధాంత స్ఫూర్తి ఉందన్నారు.

వందేండ్ల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమం..త్యాగాలతో ముందుకు నడిచిందన్నారు. సీఎం కేసీఆర్ దీక్షా ఫలితం.. అమరుల త్యాగ ఫలితంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ దీక్షా పోరాట ఫలితంగా 2009లో నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం చదివిన ప్రకటన ఆచార్య జయశంకర్ సార్ రాసిందేనన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చిన నాడు దీక్షా విరమణ కోసం కేంద్ర మంత్రులు, ఆనాటి సీఎం రోశయ్య నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ దీక్షను విరమింపజేస్తామంటే వారిని వద్దని ఆచార్య జయశంకర్ ఇచ్చిన నిమ్మరసంతో దీక్షను విరమించి సీఎం కేసీఆర్ జయశంకర్ సార్‌ను ఆకాశమంతా ఎత్తులో నిలిపారన్నారు. ఉద్యమం పడిలేచిన ప్రతిసారి మాకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించింది ఆచార్య జయశంకర్, 1969 ఉద్యమకారులే అన్నారు. 1969 ఉద్యమకారులు చూపిన స్ఫూర్తితోనే మలి దశ ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు.

1969 ఉద్యమకారుల చరిత్రను పుస్తకంగా తీసుకురావాలి..
తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి సిద్దిపేటతో అవినాభావ సంబంధం ఉందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 1969 ఉద్యమంలో జరిగిన మొదటి ఉప ఎన్నికల్లో ఆంధ్రా పాలకులు నోట్ల కట్టలు పారించినా అప్పటి టీపీఎస్ అభ్యర్థి మదన్‌మోహన్‌ను, మలిదశ ఉద్యమాన్ని అణచడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నోట్ల కట్టలు, సారా సీసాలు కుమ్మరించినా ప్రజలు 2001లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్‌ను గెలిపించి ఉద్యమస్ఫూర్తిని చాటారన్నారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఉద్యమకారుల అందరి ఫొటోలు, వారి అనుభవాలతో పుస్తకాన్ని తీసుకరావాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు, సీఎం కేసీఆర్ నిరాహార దీక్షకు, హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యోగగర్జనకు వేదిక సిద్దిపేటనే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ సిద్దిపేట బిడ్డ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, శిశు సంక్షేమ జిల్లా ఆర్గనైజర్ బూర విజయ, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, ఎలక్షన్‌రెడ్డి, పాల సాయిరాం, ఉపాధ్యాయ సంఘ నాయకులు తిరుపతిరెడ్డిలతో పాటు వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, 1969 ఉద్యమకారులు, మలిదశ ఉద్యమకారులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...