కొత్త కాలనీలకు ఆధునిక హంగులు


Sun,August 11, 2019 11:28 PM

సిద్దిపేట అర్బన్: రోడ్లు కబ్జా చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టొద్దు.. నిబంధనలు పాటించకపోతే కూల్చివేతలు తప్పవు. రానున్న రోజులలో సిద్దిపేట శివారు ప్రాంతాలలోని కొత్త కాలనీలను సకల సౌకర్యాలతో అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ, పట్టణ శివారులోని టీహెచ్‌ఆర్ నగర్(తన్నీరు హరీశ్‌రావు నగర్), హనుమాన్‌నగర్, నర్సాపూర్ డబుల్‌బెడ్ రూం కాలనీ శివార్లలో ఆదివారం రూ.6కోట్ల వ్యయంతో నిర్మించనున్న మిషన్ భగీరథ నీటి ట్యాంకు నిర్మాణాలకు సిద్దిపేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మున్సిపల్ చైర్మన్ కడవేర్గురాజనర్సులతో కలిసి ఎమ్మెల్యే హరీశ్‌రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా టీహెచ్‌ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు. ఇండ్ల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.

మీకు ఇచ్చిన స్థలాలు అమ్ముకోవద్దని, ప్లాటు అమ్మినా..కొన్నా.. నేరమేనని క్రయ విక్రయాలు జరపొద్దని కాలనీ ప్రజలకు సూచించారు. రెండు చోట్ల రూ. 2.60 లక్షల రూపాయల వ్యయంతో తాగు నీటి ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రతి ఇంటికి మూడు నెలల్లో స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తామన్నారు. ఈ కొత్త కాలనీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దృష్ట్యా త్వరలోనే యూజీడీ నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సుకు సూచించారు. టీహెచ్‌ఆర్ కాలనీలో నీటి ట్యాంకు నిర్మాణాలు చేసుకోవడం సంతోషకరమని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీలో విరివిగా చెట్లు నాటాలని జడ్పీ చైర్మన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ తుపాకుల ప్రవళిక, సర్పంచ్ రేణుక-శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసాచారి, డిప్యూటీ ఈఈ నాగభూషణం, ఉపాధి హామీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ తుపాకుల బాల్‌రంగం, పొన్నాల ఉప సర్పంచ్ కెకె రావు, టీహెచ్‌ఆర్ కాలనీ అధ్యక్షుడు నర్సింలు, 8వ వార్డు కౌన్సిలర్ బండారి నర్సింలు, నాయకులు దాబా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...