హరిత సంకల్పం


Fri,August 9, 2019 11:10 PM

-జోరుగా మొక్కలు నాటుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
-ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పొలంగట్లపైనే ప్రధానంగా..
-శాఖల వారీగా మొక్కలు నాటేందుకు టార్గెట్
-నాలుగువిడుతల్లో 80శాతం నాటిన మొక్కలు రక్షించినందుకు గుర్తింపు
-ఐదోవిడుతలో 3 కోట్ల 82 లక్షల 70 వేల మొక్కలు నాటే లక్ష్యం
-ప్రతి ఇంటికి ఐదు మొక్కలు
-ప్రతి గ్రామానికి వందమంది రైతుల ఎంపిక

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : చెట్లు ఉంటేనే ప్రగతి..లేకుంటే అధోగతి. ఈ విషయం తెలియనది కాదు. జనాభాలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ఈ సమతుల్యత లేకపోవడంతో కరువు కాటకాలు, వర్షాభావం పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దుస్థితిని పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం జిల్లాలో ఉద్యమంలా నడుస్తున్నది. ఇప్పటివరకు నాలుగు విడుతల హరితహారం పూర్తికాగా, ప్రస్తుతం ఐదో విడుత మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతున్నది. వారంపదిరోజులుగా విస్తారంగా వానలు కురుస్తుండడంతో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటుతున్నారు. నీడనిచ్చే మొక్కలతోపాటు పండ్లు, పూలు, ఈత మొక్కలు నాటుతున్నారు. ప్రతి ఇంటికి ఐదు మొక్కల చొప్పున పంపిణీ చేయడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను ఇంటి యజమానికి అప్పగిస్తున్నారు. సంస్థ అయితే సంస్థ యజమానికి, పంచాయతీలో నాటిన మొక్కలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు బాధ్యత తీసుకుంటున్నారు. మొక్కల సంరక్షణకు ఎప్పటికప్పుడు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు విడుతల్లో నాటిన మొక్కల్లో 80 శాతం పైగా సంరక్షించడంతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచింది. ఐదోవిడుత హరితహారంలో 3కోట్ల82లక్షల 70 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటివరకు దాదాపు 50 లక్షల వరకు నాటారు. అంతేకాదు శాఖల వారీగా మొక్కలు నాటేలా ప్రభుత్వం లక్ష్యాలు విధించింది.

హరితహారం కార్యక్రమ నిర్వహణలో సిద్దిపేట జిల్లా రాష్ర్టానికి స్ఫూర్తిగా మారుతున్నది. నాలుగు విడుతల్లో నాటిన మొక్కల్లో 80శాతానికి పైగా సంరక్షించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో సిద్దిపేట నిలిచింది. హరితమిత్ర అవార్డులను సైతం సొంతం చేసుకుంది. పది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో గ్రామగ్రామాన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. ఐదో విడుత హరితహారంలో 3 కోట్ల 82 లక్షల 70 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకుని, ఈ వర్షాలకు నేటి వరకు సుమారు 50లక్షలకు పైగా మొక్కలు నాటారు.

ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి ఇంటికి ఐదు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో పండ్లు, పూల మొక్కలున్నాయి. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా బాధ్యతలను అప్పగించారు. ఇంటి ముందు నాటిన మొక్కలకు ఇంటి యజమానిని బాధ్యత చేశారు. ఇనిస్టూషన్‌లో నాటిన మొక్కలకు ఇనిస్టూషన్ ఉన్నతాధికారిని బాధ్యతగా, గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు బాధ్యత తీసుకుంటున్నారు. మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చెరువు కట్టలపై ఈత మొక్కలను నాటుతున్నారు.

ప్రతి గ్రామానికి వంద మంది రైతుల ఎంపిక
ప్రతి గ్రామానికి వంద మంది రైతులను ఎంపిక చేసి, పొలం గట్లపై మొక్కలు నాటేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏవో, ఏఈవోలు గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, పొలం గట్లపై మొక్కలు పెంచడంతో కలిగే లాభాలు వివరిస్తున్నారు. మొక్కల సంరక్షించినందుకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వివరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల నుంచి రైతుల వివరాలను సేకరించి, మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటుతున్నారు. పొలం గట్లపై ప్రధానంగా టేకు, సీతాఫలం తదితర మొక్కలు పెడుతున్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి, సపోట మొక్కలతో పాటు ఈత మొక్కలను కూడా విరివిగా నాటుతున్నారు. రైతులు పొలం గట్లపై నాటిన మొక్కలకు ఒక్కో మొక్క సంరక్షించినందుకు బతికున్న ప్రతిమొక్కకు నెలకు రూ.5 చొప్పున మూడేండ్ల వరకు చెల్లిస్తారు. మామిడి మొక్కలు ఎకరానికి 70 మొక్కలు నాటాల్సి ఉంటుంది.

మూడేండ్లకు మెయింటనెన్స్ ఇస్తారు. ఒక్కో మొక్కకు నెలకు రూ.15 చొప్పున కట్టిస్తారు. సీతాఫలం మొక్కకు మూడేండ్ల మెయింటనెన్స్ ఇస్తారు. దీనికి కూడా ఒక్కో మొక్కకు నెలకు రూ.15 చొప్పున ఇస్తారు. ఈత మొక్కలకు రెండు సంవత్సరాలు.. ఒక్కో మొక్కకు రూ.5, సపోటకు మూడేండ్లకు ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున రైతుకు చెల్లిస్తారు. మొక్క బతికి ఉంటేనే ఈ మెయింటనెన్స్ డబ్బులు వస్తాయి. మొక్కలను సంరక్షించడంతో రైతు ఉపాధి పొందడంతో పాటు పొలం గట్లపై పెట్టిన చెట్ల ఆకులు పొలంలో పడి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. రెండు విధాలుగా ఉపయోగపడడంతో రైతులను ప్రోత్సహిస్తున్నారు. గత హరితహారంలో పొలం గట్లపై నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...