నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్ సర్కారు


Sat,July 20, 2019 11:44 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ, దుబ్బాక టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతున్నదని, నిరుపేదల అభివృద్ధి కోసం ఎన్నోరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో పింఛన్ లబ్ధిదారులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పింఛన్ పంపిణీ ఉత్తర్వుల కార్యక్రమం కొనసాగింది. లబ్ధిదారులకు ఉత్తర్వులతో పాటు స్వీట్‌ప్యాకెట్‌ను అందజేశారు. కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి వెంకట్రామ్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఆర్‌డీవో గోపాల్, నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మొత్తం 41,200 మందికి పింఛన్ ప్రొసీడింగ్‌లు మంజూరయ్యాయి.

వృద్ధులకు పెద్ద కొడుకుగా మారిన సీఎం కేసీఆర్...
నిరుపేదలకు అండగా.. వృద్ధులకు పెద్ద కొడుకుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. గత ప్రభుత్వాలు 70 ఏండ్లలో చేయలేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేవలం ఆరేండ్లలో చేసి చూపించిన ప్రభుత్వం అంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వ పథకాలను గామీణ ప్రజలకు చేరేలా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గానికి కాల్వల ద్వారా గోదారి నీళ్లు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సమిష్టిగా కృషి చేద్దామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే నెలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన నిర్వహించి జూట్‌బ్యాగ్‌ల పంపిణీ చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌తోనే పేదలకు న్యాయం: ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి...
సీఎం కేసీఆర్‌తోనే పేదలకు సముచిత న్యాయం దక్కిందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి..పింఛన్ లబ్ధిదారులకు పెంచిన పింఛన్లు మంజూరు చేశారని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కంటే దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధికంగా పింఛన్ లబ్ధిదారులుండటం గొప్ప విషయమన్నారు. త్వరలోనే మల్లన్నసాగర్ పూర్తి చేసి నియోజకవర్గంలో బీడు భూములను సస్యశ్యామలంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

పేదలకు పింఛన్లు శాశ్వత భరోసా: కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి...
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ నెలనెలా పింఛన్ డబ్బులు మంజూరు చేస్తూ.. శాశ్వత భరోసానిచ్చిందని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. రా్రష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలలో తాము ప్రభుత్వాధికారులుగా భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నిరుపేదలకు డబ్బు కంటే వారు బతికున్నంత కాలం పింఛన్ ఇవ్వటమే సరైన భరోసా అని ఆయన అన్నారు. జిల్లాలో సంవత్సరానికి రూ.212 కోట్ల పింఛన్ల రూపేణ పేదలకు అందిస్తున్నామని తెలిపారు. ఇపుడు పింఛన్ సొమ్ము రెండింతలు చేయటంతో పాటు పింఛన్ లబ్ధిదారులు పెరిగారన్నారు. యేడాదికి పింఛన్‌దారులకు రూ.422 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 66,774 మంది అర్హులైన పింఛన్‌దారులకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ అన్వర్, మున్సిపల్ మిషనర్ నర్సయ్య, ఎంపీడీవో మల్లికార్జున్, టీఆర్‌ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, ఆస స్వామి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

పింఛన్‌దారులకు సీఎం అండ...
మిరుదొడ్డి: సీఎం కేసీఆర్ గ్రామాల్లోని పింఛన్‌దారులకు ఇంటి పెద్ద దిక్కుగా నిలిచి ఆర్థికంగా ఆదుకుంటున్నారని మిరుదొడ్డి ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీ లింగం అన్నారు. శనివారం ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌దారులకు పెంచిన డబ్బుల ప్రొసీడింగ్ పత్రాలను స్వీట్లతో కలిపి లబ్ధిదారులకు సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు అందజేశారు. కాగా మిరుదొడ్డిలోని వికలాంగుల పునరావాస కేంద్రం వద్ద వికలాంగులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సిద్ధి భారతి భూపతి గౌడ్, కంచం యాదగిరి, సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి మనోజ్ కుమార్, ప్రత్యేక అధికారులు ఏవో మల్లేశం, ఎంఈవో ప్రభుదాస్, పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం...
తొగుట: తెలంగాణ రాష్ట్రం సాధించడంతో పాటు తెలంగాణను అభివృద్ధి -సంక్షేమంలో దేశంలోనే నెం1 చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని తొగుట ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని లింగాపూర్‌లో శనివారం పింఛన్ దారులకు పెంచిన పింఛన్ మంజూరుపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పింఛన్ మంజూరు కావాలంటే ఏళ్లు గడిచేదని, నేడు పింఛన్‌ను పెంచడంతో పాటు అర్హులైన వారందరికి పింఛన్లు ఎప్పటికప్పుడు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పింఛన్ డబ్బులను పెంచడంతో గ్రామగ్రామాన పింఛన్‌దారుల్లో సంతోషం నెలకొంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీల చేతులమీదుగా పింఛన్ పత్రాలను అందించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ వీర్‌సింగ్, ఎంపీడీవో రాజిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం...
రాయపోల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ రణం జ్యోతి, రాయపోల్ ఎంపీపీ అనిత శ్రీనివాస్, జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి అన్నారు. శనివారం ఆయా గ్రామాల్లో పెంచిన ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ ప్రత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా గుర్తింపు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...