మీ రాక కోసం


Sat,July 20, 2019 12:04 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి సీఎం కేసీఆర్ ఈ నెల 22న రానున్నట్లు తెలిసింది. దీంతో గ్రామంలో అధికారయంత్రాగం ముమ్మరంగా ఏర్పాట్లు చే స్తోంది. చింతమడక గ్రామం మధిర గ్రామలైన అంకంపేట, దమ్మచెరువు గ్రామాల్లో కలిపి మొత్తం 860కుటుంబాలుంటాయి. ఈ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వారి జీవన విధా నం తదితర అంశాలపై వారం రోజుల కిందట సమగ్ర కుటుం బ సర్వే చేపట్టారు. ఆయా శాఖల వారీగా సర్వే నివేదికలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అధికారులు అందించిన నివేదిక ప్రకారం గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు గ్రామాభివృద్ధియే లక్ష్యంగా ప్రణాళికలను తయారు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో గ్రామంలో ఎవరెవరికి ఏమేమి కావాలో ఆయా కుటుంబాల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో నివసిస్తున్న వారితో పాటు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా మళ్లీ తిరిగి గ్రామానికి చేరుకొని దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారందరికి జీవనోపాధి కోసం వివిధ పథకాల కింద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గ్రామాభివృద్ధికి ఇప్పటికే రూ.10కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతో గ్రామంలో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ చింతమడక గ్రామానికి వస్తున్న నేపథ్యంలో గ్రామాన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు. రోడ్డు మార్గాన వస్తారా? హెలీక్యాప్టర్‌లో వస్తారా? ఇంకా తెలియాల్సి ఉంది.

ఆత్మీయ సమావేశానికి ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ చింతమడక గ్రామానికి వస్తున్న నేపథ్యంలో గ్రామ శివారులో హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఇందుకోసం ఐకేపీ గోదాం సీసీ ప్లాట్‌ఫాం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. రేయిన్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. 60మంది కూర్చునేలా సభావేదికను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 3200మంది గ్రామస్తులు కూర్చునేలా కుర్చీలు, మీడియా గ్యాలరీ, అధికారుల కోసం 400 కుర్చీలను వేయనున్నారు. పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వన భోజనాలు చేసే స్థలం, ఆలయం పక్కనున్న చింత చెట్టు కింద సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాళీ స్థలంలో గ్రామస్తులందరూ భోజనం చేసేలా రేయిన్ ప్రూఫ్ టెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ పనులు రెండు రోజుల నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. భోజనాలు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటుతున్నారు. మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.

గ్రామస్తులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు
గ్రామస్తులతోనే సీఎం కేసీఆర్ ఒక రోజు గడపనుండడంతో ఇతర గ్రామాల నుంచి ఎవరిని కూడా అనుమతించడం లేదు. గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ఐడీ కార్డులను అందజేయనున్నారు. సుమారు 3200 మందికి ప్రత్యేక ఐడీ కార్డులిచ్చి, సమావేశానికి పంపిస్తారు. వారందరితో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పెద్దమ్మ గుడి పక్కన ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాల్లో సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి భోజనాలు చేస్తారు. ఇప్పటికే పెద్దమ్మ ఆలయానికి రంగులు వేసి పందిళ్లు వేస్తున్నారు. సహపంక్తి భోజనాలకు రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. నేటి సాయంత్రం వరకు టెంట్లు వేసే పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. ఇతర గ్రామాల నుంచి ఎవరిని కూడా రాకుండా గ్రామం చుట్టూ పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ గ్రామంలో పర్యటించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...