ప్రతి 30 ఇండ్లకు ఒక అధికారి ఇన్‌చార్జి


Fri,July 19, 2019 11:59 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేలా కృషి చేయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కోరారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్ డెవిస్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జేసీ పద్మాకర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సర్వే చేసిన అధికారులే ఇంటింటికీ వెళ్లి సీఎం సభకు హాజరయ్యే గ్రామస్తులకు ఐడీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. గ్రామస్తులందరికీ గులాబీ రంగులో కార్డులు ఇవ్వాలని చెప్పారు. అధికారులకు తెలుపు రంగు, మీడియా ప్రతినిధులకు ఆకుపచ్చ రంగు ఐడెంటీ కార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు. గ్రామంలోని 630 గృహాలను టీంలుగా విభజించి, ప్రతి 30ఇండ్లకు ఒక ఎంపీడీవోతో పాటు అదనంగా మరో ప్రత్యేకాధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్లు చెప్పారు. కేటాయించిన 30 ఇండ్ల ప్రజలకు అధికారి అందుబాటులో ఉంటూ సభా సమావేశం పూర్తయ్యే వరకు ఉండాల్సిన బాధ్యత ఆ అధికారిదే అన్నారు. వర్షాకాలం దృష్ట్యా కావాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సమీక్షించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చింతమడక గ్రామంలో ఉన్న పెద్ద చెరువు సుందరీకరణపై ఇరిగేషన్ అధికారులతో చర్చించి కావాల్సిన ప్రజంటేషన్ సిద్ధం చేయాలని సూచించారు. డీఆర్‌డీవో పీడీ, డీఎస్‌వో, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు. సీఎం రాక నేపథ్యంలో సభా సమావేశంలో ఉండాల్సిన వసతులు, అలాగే గ్రామస్తులు, వీఐపీ, మీడియా ప్రతినిధులకు భోజనాల వద్ద ఉండాల్సిన అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు ఎవరెవరనే అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...