చూడచక్కని రామసముద్రం


Fri,July 19, 2019 02:30 AM

దుబ్బాక టౌన్ : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు ఎంతో ఇష్టమైన దుబ్బాక రామసముద్రం చెరువు కట్ట మరింత శోభాయామానంగా రూపుదిద్దుకొట్టుంది. రూ.10 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టుతుండగా చెరువు దుబ్బాక పట్టణానికే కొత్త అందాన్ని తెచ్చిపెట్టుతుంది. రాష్ట్రంలోని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెరువు కట్టను అధునాతన హంగులతో అభివృద్ధిపరుస్తున్నారు. దుబ్బాకతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు మానసికోల్లాసం పొందేందుకు తగు ఏర్పాట్లు కల్పిస్తున్నారు. చెరువులో ఇప్పటికే రూ. 20 లక్షల నిధులతో రెండు బోట్లను ఏర్పాటు చేశారు. చెరువు కట్టపై వాకింగ్ కోసం ట్రాక్‌ను నిర్మించడంతో ఉదయం, సాయంత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా ఇటీవల ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పెద్ద సంఖ్యలో పట్టణవాసులు తరలి వచ్చి కసరత్తు చేస్తున్నారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఓపెన్ జిమ్ పక్కనే 50 మీటర్ల వెడల్పుతో చిన్న పిల్లల కోసం రూ. 30 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో ఆట వస్తువులను ఏర్పాటు చేస్తున్నారు. రంగుల రాట్నం, నాలుగు రకాల జారుడు బండలు, స్ప్రింగ్‌రైడర్, ఉయ్యాలలు వంటి 10 రకాల ఆట వస్తువులను పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఆట వస్తువుల బిగింపు పనులను మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య పరిశీలించారు. ఈ నెల 20న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...