మున్సిపల్ ఓటర్ల తుది ముసాయిదా విడుదల


Wed,July 17, 2019 12:17 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను మంగళవారం అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం79,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 40,176 , పురుషులు 39,224, ఇతరులు ఒకరు ఉన్నారు. ఆయా మున్సిపాలీటిలో ్లఎస్సీ, ఎస్టీ, ఓసీ, మహిళా ఓటర్ల వివరాలను ఆయా మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో తుది జాబితాను ఉంచారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గాను సిద్దిపేట మినహా నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఇందు కోసం అభ్యంతరాలు, సలహాలను స్వీకరించేందుకు అన్ని మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో నేడు( బుధవారం ) ప్రత్యేక సమావేశాన్ని అధికారులు నిర్వహించనున్నారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్దిపేట, గజ్వేల్ -ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, కొత్తగా ఏర్పాటైన చేర్యాల మున్సిపాలిటీలతో కలుపుకొని ఐదు మున్సిపాలిటీలున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీకి పాలక వర్గం పదవీకాలం మరో ఏడాదిన్నరకు పైగా సమయం ఉంది. ఇక మిగిలిన గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు ఈ నెల 2న పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఈ రెండు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. గజ్వేల్‌కు జాయింట్ కలెక్టర్ పద్మాకర్, హుస్నాబాద్‌కు సిద్దిపేట కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ఇక చేర్యాల మున్సిపాలిటీగా ఆవిర్భవించగానే జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రావణ్‌కుమార్ ప్రత్యేకాధికారిగా నిమమించారు. దుబ్బాక గత ఎనిమిది ఏండ్లుగా అధికారుల పాలనలోనే కొనసాగుతున్నది. ప్రస్తుతం గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్లు 54,895 , ఎస్సీ11,332 ఎస్టీ 892, ఇతరులు 12,282 మంది ఓటర్లున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రతి 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని నియమించనున్నారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 143 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే గజ్వేల్ మున్సిపాలిటీలో మరో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 145 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు బుధవారం అన్ని మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఆయా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 21న తుది పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...