మిషన్ భగీరథ పథకం


Sat,July 13, 2019 11:04 PM

-ప్రజల దాహార్తి తీర్చడానికి అద్భుత పథకం
-రిటర్నింగ్ వాల్వ్‌ల ఏర్పాటు సూపర్
-సీఎం కేసీఆర్ ముందుచూపు గ్రేట్
-ట్రైనీ ఐఏఎస్‌లను ఆకట్టుకున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు
-కోమటిబండ సంప్‌హౌస్ పరిశీలన
-సెల్ఫీలు, ఫొటోలు దిగి మురిసిపోయిన అధికారులు
గజ్వేల్ రూరల్: మిషన్ భగీరథ పథకం అద్భుతమని, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రణాళికను సిద్ధం చేసి, కోమటిబండ గుట్టపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ సంప్‌హౌస్, ప్రాజెక్టు తమను ఎంతగానో ఆకట్టుకున్నదని ట్రైనీ ఐఏఎస్‌లు, గ్రూప్-1 అధికారులు కొనియాడారు. గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై గల మిషన్ భగీరథ ప్రాజెక్టును 2018 ఐఏఎస్ బ్యాచ్ ట్రైనీల బృందంతో పాటు ట్రైనీ గ్రూప్-1 అధికారులు శనివారం సందర్శించారు. బృందంలో తొమ్మిది ఐఏఎస్‌లతో పాటు గ్రూప్-1 అధికారులు 70మంది గంటకు పైగా మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. గుట్టపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కోమటిబండ సంప్‌హౌస్ నిర్వహణ తీరును, నీటి సేకరణ, శుద్ధీకరణ, గ్రామాలకు నీటి సరఫరా తదితర విషయాలను మిషన్ భగీరథ సిద్దిపేట ఈఈ శ్రీనివాసచారి, డీఈఈ నాగార్జున, సతీశ్ తదితరులు వారికి క్షుణ్ణంగా వివరించారు. మిషన్ భగీరథతో తాగునీటి సరఫరాను పటిష్టంగా నిర్వహించడంతో ప్రాజెక్టుకు హడ్కో అవార్డులు మూడు సార్లు, స్కాచ్ అవార్డులు లభించాయని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అభినందించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ విజయవంతం అమలవుతుండడంతో వివిధ రాష్ర్టాల సీఎంలతో పాటు అధికారులు ఈ పథకాన్ని సందర్శించారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేశారన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ర్టాల్లో జల్‌జీవన్ అనే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని వెల్లడించారు.

ప్రణాళికలు చాలా బాగున్నాయి..
ఎల్లంపల్లి నుంచి నీటిని సేకరించి, గజ్వేల్ సంప్‌హౌస్ ద్వారా మూడు నియోజకవర్గాల గ్రామాలకు నీటిని అందించడానికి చేసిన ప్రణాళిక చాలా అద్భుతంగా ఉందని ట్రైనీ ఐఏఎస్‌లు, గ్రూప్-1 అధికారులు చెప్పారు. తామంతా 2018 బ్యాచ్‌కు చెంది, మసూరిలో ఐఏఎస్ ట్రైనీ శిక్షణ పూర్తి చేశామని, తమను తమను తెలంగాణ రాష్ర్టానికి కేటాయించారని అధికారులు తెలిపారు. హైద్రాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నెల రోజుల నుంచి రాష్ట్రంలోని పలు అంశాలపై శిక్షణ తీసుకుంటున్నామన్నారు. నెల రోజుల నుంచి రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ పథకాలు, చట్టాలను పరిశీలిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథక నిర్వహణ తెలుసుకోవడానికి ఇక్కడికి పంపించారన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని అధ్యయనం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ప్రజల దాహం తీర్చడానికి సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ లాంటి అద్భుత పథకాన్ని రూపొందించడం చాలా గొప్ప విషయమన్నారు. ముఖ్యంగా నీటిని అందరికీ సమానంగా పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ వాల్ పనితీరు బాగుందన్నారు.

సెల్ఫీలు, ఫొటోలతో సందడి..
సంప్‌హౌస్ నిర్మాణాన్ని పరిశీలించిన గ్రూప్-1 అధికారులంతా సెల్ఫీలు, ఫొటోలు తీస్తూ అధ్యయనాన్ని ఎంజాయ్ చేయడం కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే, నీటిని సేకరించే దూరం తగ్గి, వ్యయం తక్కువయ్యే అవకాశం ఉంది కదా అంటూ అధికారులను ట్రైనీ కలెక్టర్లు ప్రశ్నించారు. డిప్యూటీ కలెక్టర్ మాధురి, డీఎస్పీ ఉదయ్‌రెడ్డి పర్యవేక్షణలో ట్రైనీ ఐఏఎస్‌లు అభిలాష్, అనుదీప్, తేజస్, ఆదర్శ్, మనంద, దీపక్, హర్ణ, హేమంత్‌తో పాటు గ్రూప్-1 అధికారులు మిషన్ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ భరత్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ప్రవీణ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...